Breaking News

HBD Kota Srinivasa Rao : విలక్షణ నటనకు చిరునామాగా మారిన ‘కోట’


తెలుగు చలన చిత్రసీమలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక శకం అని చెప్పుకోవాలి. భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించి ఎంతో మంది భయపెట్టిన కోట.. అంతే స్థాయిలో నవ్వించేరు. విలన్, కమెడియన్‌గా కాకుండానే.. విలనిజంలోనే కామెడీని పండించడంలోనే కోట ప్రత్యేకత ఉంటుంది. ఎన్నెన్నో భిన్న రకాల పాత్రలకు కోట ప్రాణం పోశారు. అలాంటి కోట పుట్టిన రోజు నేడు (జూలై 10). కోట బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొన్ని పాత్రల విశేషాలు చూద్దాం. తెలంగాణ యాసలో కోట పలికే సంభాషణలు ఎప్పుడూ ప్రత్యేకమే. అదో ట్రేడ్ మార్క్‌లా మారిపోతుంది. నమస్తే తమ్మీ అని కోట పలికినట్టుగా మరొక నటుడు పలకలేరు. పాత్ర కోసం పట్టుబట్టి తెలంగాణ యాసను నేర్చుకున్నారు కోట. అందుకే ప్రతీ మాట, పదంలోనూ స్పష్టత గోచరిస్తుంటుంది. తెలంగాణ మాండలికాన్ని పలకడంలో కోటకు సరిలేరు ఎవ్వరూ అని చెప్పవచ్చు. గణేష్, గాయం, ప్రతిఘటన వంటి చిత్రాల్లో కోట తెలుగు ప్రేక్షకులను భయపెట్టేశారు. అలానే మామగారు, స్నేహం కోసం, చిన్నరాయుడు వంటి ఎన్నో చిత్రాలతో నవ్వులు పూయించారు. తండ్రిగా అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఆడవారు మాటలకు అర్థాలే వేరులే, బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించారు. ఇక బాబు మోహన్‌తో కలిసి చేసిన ప్రతీ సినిమా ఓ సంచలనమే. కామెడీలో ఈ ఇద్దరూ మిత్రద్వయం వంటి వారు. సినిమాల పరంగానే కాకుండా కోట రాజకీయాల్లోనూ రాణించారు. ఇక తెలుగు నటులు, టెక్నీషియన్స్ కోసం ఎప్పుడూ గొంతెత్తేవారిలో కోట ముందుంటారు. పరభాష నటులను ఎక్కువగా తీసుకురావడం, ఇక్కడి వరకు అవకాశాలు ఇవ్వకపోవడం, ప్రాధాన్యతను తగ్గించడంపై కోట బహిరంగంగానే దర్శకనిర్మాతలను విమర్శించారు. తెలుగు నటీనటుల కోసం కోట ఎప్పుడూ మాట్లాడేవారు. వృద్దాప్యం మీద పడుతున్నా కూడా ఏదో ఒక పని చేయాలని, సినిమాల్లో ఇంకా నటించాలనే కోరిక ఉందని కోట తెలిపారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి వారిని అడిగానని, ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని అన్నానంటూ కోట ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


By July 10, 2021 at 11:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kota-srinivasa-rao-birthday-special-story/articleshow/84288884.cms

No comments