Breaking News

భారత్ సంచలన నిర్ణయం.. కాందహార్ కాన్సులేట్ మూసివేత.. స్వదేశానికి స్టాఫ్!


అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వైదొలగడంతో మళ్లీ రెచ్చిపోతున్నారు. అఫ్గన్ భూభాగం నుంచి అమెరికా తన సేనలను సెప్టెంబరు నాటికి పూర్తిగా ఉపసంహరించుకోనుండగా.. తాలిబన్లు పట్టుబిగుస్తున్నారు. ఇప్పటికే 85 శాతం భూభాగాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గన్‌ దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణమైన కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి వాయుసేన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. కాందహార్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు పట్టుబిగించారు. ఏ క్షణంలోనైనా తాలిబన్ మూకలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అదే జరిగితే అఫ్గాన్ భద్రతా బలగాలు, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరిగే అవకాశం ఉంది. మరోవైపు, తాలిబన్ల నీడలో ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల ప్రాబల్యం ఈ ప్రాంతంలో అధికంగా ఉంది. తాలిబన్లతో కలిసి వీరంతా భద్రతా బలగాలపై దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ భారత రాయబార కార్యాలయం సిబ్బందిని ఉంచడం సురక్షితం కాదని భారత ప్రభుత్వం భావించింది. ముష్కరులు దాడులకు గురియ్యే ప్రమాదం ఉందని అంచనాకొచ్చిన భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అక్కడ పనిచేస్తున్న 50 మందిని ఎయిర్‌ఫోర్స్ విమానంలో తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అఫ్గనిస్థాన్‌లో క్షీణిస్తున్న భద్రత పరిస్థితులు, అక్కడ భారతీయుల రక్షణ, భద్రతపై ప్రభావాన్ని భారత్ నిశితంగా గమనిస్తోందని ఇటీవల విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇదిలా ఉండగా గత కొద్ది వారాలుగా అఫ్గన్‌లో ఉగ్రవాదుల దాడులు చోటుచేసుకుంటున్నాయి. రెండు దశాబ్దాల పాటు అఫ్గన్ గడ్డపై పోరాటం సాగించిన అమెరికా.. శాంతి స్థాపన లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరుగుతోంది. ఇదిలా ఉండగా, కాందహార్, మజర్-ఈ-షరీఫ్‌లోని దౌత్య కార్యాలయాలను మూసివేసే ఆలోచన లేదని కాబూల్‌లోని ఇండియన్ ఎంబసీ గురువారం ప్రకటించింది. అఫ్గన్‌లో దిగజారుతున్న పరిస్థితులపై ఆ దేశ రాయబారి ఫరీద్ మాముండ్జాయ్.. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా కలిసి వివరించారు. అఫ్గనిస్థాన్‌లో పర్యటించేవారు, అక్కడ పనిచేస్తున్న భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం గతవారం ప్రకటించింది. అక్కడ వివిధ ప్రాంతాలలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనల దృష్ట్యా అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది.


By July 11, 2021 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-pulls-around-50-diplomats-and-other-staff-in-kandahar-consulate-as-taliban-advances/articleshow/84312517.cms

No comments