కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఓ జవాన్ వీరమరణం.. సైన్యం ట్రాప్‌లో నలుగురు ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు, సైన్యం మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లా హంజిన్ రాజ్‌పొర ప్రాంతం వద్ద గురువారం అర్ధరాత్రి ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులతో పోరాడుతూ ఓ సైనికుడు అమరుడయ్యాడు. ఆ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులున్నట్టు గుర్తించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. హంజిన్ రాజ్‌పొర వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయని పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాలు.. నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించినట్టు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ అమరుడైనట్టు అధికారులు వెల్లడించారు. రెండు రోజుల కిందటే లష్కరే తొయిబాకు చెందిన కమాండర్ నదీమ్ అబ్రార్ సహా మరో ఉగ్రవాదిని శ్రీనగర్ శివారులోని పరింపొర వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కలకలం కొనసాగుతోంది. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి తర్వాత రోజూ ఏదో ఒక ప్రాంతంలో డ్రోన్ల చక్కెర్లు కొట్టడంతో సైన్యం అప్రమత్తమయ్యింది. తాజాగా, శుక్రవారం తెల్లవారుజామున అర్నియా సెక్టార్‌లో సరిహద్దులు దాటి ఓ డ్రోన్ భారత్ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన సైన్యం కాల్పులు జరపడంతో డ్రోన్ వెనుదిరిగింది. డ్రోన్ల సహాయంతో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహిస్తున్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
By July 02, 2021 at 10:53AM
No comments