Breaking News

అమెరికా వెళ్లే స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఎయిరిండియా కీలక ప్రకటన


అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆగస్టు తొలి వారం నుంచి అమెరికాకు వెళ్లే విమాన సర్వీసులను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. ఈమధ్య కాలంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేందుకు చాలామంది విద్యార్థులు సిద్ధం కాగా.. ఎయిర్‌ ఇండియా విమానాలను రీషెడ్యూల్‌ చేయడంతో వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వెలిబుచ్చిన నేపథ్యంలో వారికి ఊరటనిచ్చేలా ఎయిర్‌ ఇండియా ప్రకటన చేసింది. ‘‘దేశంలో కొవిడ్‌ కేసులు పెరగడంతో భారత్‌ విమానాల రాకపోకలపై అమెరికా ఆంక్షలు విధించింది.. దీంతో చాలామేర ఆ దేశానికి మా విమానాలను రద్దు చేశాం.. ఇలా రద్దయిన సర్వీసుల్లో ముంబయి-నెవార్క్‌ విమానం కూడా ఉంది. ఇది మా పరిధిలో లేని అంశం కావడంతో ఈ విమాన సర్వీసుల రద్దు చేయాల్సి వచ్చింది’’ అని ఎన్డీటీవీ అడిగిన ఓ ప్రశ్నకు ఎయిర్‌ ఇండియా వివరణ ఇచ్చింది. ఆంక్షలకు ముందు వారానికి దాదాపు 40 సర్వీసులు నడిపేవారమని.. జులైలో అమెరికాకు కేవలం 11 మాత్రమే నడపగలిగామని తెలిపింది. ఆగస్టు 7 నుంచి ఈ సంఖ్యను 22కి పెంచుతున్నట్లు వెల్లడించింది. వీలైనంత ఎక్కువ మందికి ప్రయాణానికి వీలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ముంబయి-నెవార్క్‌ల మధ్య ఆగస్టు 6, 13, 20, 27 తేదీల్లో అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నట్లు ఎయిర్‌ ఇండియా ట్విట్టర్‌లో తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను మెజార్టీ దేశాలు నిషేధించాయి. మరోవైపు, ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన విదేశీ విద్యార్థులు చదువు పూర్తికాగాన వెళ్లాల్సిందేనని ఆ దేశ చట్టసభ సభ్యులు కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అమెరికా చట్టాల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు. విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక అక్కడే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే ఆప్షనల్‌ ప్రాక్టీ స్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ బిల్లును సైతం ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మారితే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువు పూర్తికాగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.


By July 31, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-students-headed-abroad-for-higher-studies-air-india-to-double-flights-to-us/articleshow/84913318.cms

No comments