Breaking News

నా అణువణువునా భారతీయతే.. అందులో నేనూ ఓ భాగమే: గూగుల్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు


తనలో భారతీయత పూర్తిగా నిండి ఉందని, తాను కూడా అందులో ఓ భాగమేనని సుందర్ పిచ్చాయ్ అన్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయంలో బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్‌కు ముప్పు సహా పలు అంశాలపై ఇంటర్వ్యూలో సుందర్ పిచ్చాయ్ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివి ఈ శతాబ్దాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయని వ్యాఖ్యానించారు. ‘నేను అమెరికా పౌరుడినే కానీ, నాలో భారతీయత నిండి ఉంది.. కాబట్టి నేను కూడా అందులో ఓ భాగమే’ అని అన్నారు. తన మూలల గురించి అడిగిన ప్రశ్నకు పిచ్చాయ్ పై విధంగా సమాధానం ఇచ్చారు. ‘నేను దీన్ని (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవాళి అభివృద్ధికి ఉపయోగపడే అత్యంత లోతైన సాంకేతిక పరిజ్ఞానంగా చూస్తాను.. మీకు తెలుసా, నిప్పు, విద్యుత్ లేదా ఇంటర్నెట్ గురించి ఆలోచిస్తే అది అలాంటిదే. కానీ నేను మరింత లోతుగా ఆలోచిస్తున్నాను’ అని అన్నారు. చైనా మోడల్ ఇంటర్నెట్ మనుగడలో ఉందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్‌ ముప్పును ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అయితే, చైనాను పరోక్షంగా ప్రస్తావించని ఆయన.. అక్కడ తమ ప్రధాన ఉత్పత్తులు గానీ, సేవలు గానీ అందుబాటులో లేవన్నారు. పన్నుల చెల్లింపు వివాదంపై స్పందిస్తూ.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపుదారులలో గూగుల్ ఒకటి.. గత దశాబ్దంలో సగటున చూస్తే మేం 20 శాతానికి పైగా పన్నులు చెల్లించాం’అని అన్నారు. ‘‘మేము అమెరికాలోని మా వాటాలో ఎక్కువ భాగాన్ని పన్నుగా చెల్లిస్తాం.. ఎందుకుంటే మా సంస్థను అక్కడ ప్రారంభించాం.. ఉత్పత్తులు అభివృద్ధి చెందాయి.. పన్ను చెల్లింపులకు సంబంధించి సరైన మార్గాన్ని గుర్తించే ప్రపంచ OECDకి మేము మద్దతు ఇస్తున్నాం.. ఈ సమస్య పరిష్కారం ఒకే సంస్థకు భారమవుతుంది’’అని చెప్పారు. తన వ్యక్తిగత సాంకేతిక అలవాట్ల గురించి కూడా పిచ్చాయ్ మాట్లాడుతూ.. పాస్‌వర్డ్‌ల విషయానికి వస్తే ‘రెండు-కారకాల ప్రామాణీకరణను స్వీకరించాలని సూచించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి తన ఫోన్‌ను ఎప్పటికప్పుడు మారుస్తుంటానని ఒప్పుకున్నారు.


By July 13, 2021 at 10:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-is-deeply-within-me-says-google-ceo-sundar-pichai/articleshow/84368054.cms

No comments