Breaking News

ఐదు పైసలకే నోరూరించే బిర్యానీ.. ఎగబడిన జనం, అక్కడే ట్విస్ట్


బిర్యానీ పేరు వింటే అందరికీ నోరూరుతుంది. అలాంటి బిర్యానీని కేవలం 5 పైసలకే ఇస్తే జనాలు ఆగుతారా..? తమిళనాడులోని జిల్లాలో ఓ హోటల్ యజమానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ హోటల్‌ ప్రారంభ ఆఫర్‌గా 5పైసలకే ప్లేటు బిర్యానీ అని ప్రకటిస్తే జనాలు ఎగబడి తిన్నారు. అయితే ఈ ఆఫర్‌‌కు కొన్ని షరతులు విధించినా జనాలు మాత్రం క్యూ కట్టడంతో ఆ హోటల్‌ కిటకిటలాడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తమిళనాడులోని మధురై జిల్లా సెల్లూర్‌లో తాజాగా సుకన్య బిర్యానీ హోటల్‌ ప్రారంభమైంది. ప్రారంభ ఆఫర్‌గా 5 పైసల నాణెం తీసుకొస్తే బిర్యానీ ఉచితంగా అందిస్తామని యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎప్పుడో కనుమరుగైపోయిన ఐదు పైసల నాణేలు ఎవరి దగ్గర ఉంటాయని భావించిన హోటల్‌ యాజమాన్యానికి ఊహించని రీతిలో స్పందన ఎదురైంది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున జనాలు ఐదు పైసల నాణెం తీసుకుని వచ్చి హోటల్‌ ముందు వరుస కట్టారు. సుమారు 300 మంది వరకు 5పైసల నాణేన్ని తీసుకొచ్చి కడుపునిండా బిర్యానీ ఆరగించారు. అయితే బిర్యానీ ధ్యాసలో పడి ప్రజలు కరోనా సోకే విషయాన్ని మాత్రం మరిచిపోవడం కలవరపరుస్తోంది. ఊహించని విధంలో వందల సంఖ్యలో ప్రజలు రావడంతో హోటల్ యాజమాన్యం షట్టర్లు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆలస్యంగా వచ్చిన కొందరు 5పైసల నాణెం ఇచ్చి బిర్యానీ అడగ్గా ఇవ్వలేదు. గతంలో దిండిగల్‌ పట్టణంలో కూడా ఇలాంటి ఆఫర్‌ ప్రకటించగా అనూహ్య స్పందన వచ్చింది.


By July 22, 2021 at 06:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/special-offers-biryani-for-5-paise-in-sellur-madurai-tamil-nadu/articleshow/84625674.cms

No comments