Breaking News

పెగాసిస్ ఫోన్ హ్యాకింగ్.. జాబితాలో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్ పేర్లు


దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘పెగాసస్‌’ హ్యాకింగ్ అంశం వర్షాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్‌ను కుదిపేసింది. ఇదే సమయంలో బాధితుల జాబితాలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్లు ఉన్నట్టు బయటకు వచ్చింది. మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ సన్నిహితులకు చెందిన 18నంబర్లు కూడా హ్యాక్‌ అయ్యాయని ‘ద వైర్‌’ వార్తా సంస్థ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. అలాగే, కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ అశోక్‌ లావాసా, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌ దీప్‌ కాంగ్‌, ఎన్నికల వాచ్‌డాగ్‌ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌)’ వ్యవస్థాపకుడు జగ్‌దీప్‌ చోఖర్‌.. ఇలా చాలా మంది పెగాసస్‌ బాధితులేనని పేర్కొంది. వీరి ఫోన్లు ఎప్పుడెప్పుడు హ్యాకింగ్‌కు గురయ్యాయో కూడా వెల్లడించింది. తాజా కథనం ప్రకారం.. రాహుల్‌ గాంధీపై 2018 మే/ జూన్‌ నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా నిఘా పెట్టారు. రాహుల్‌ వాడిన రెండు నంబర్లతో పాటు ఆయన స్నేహితుల్లో ఐదుగురికి, పార్టీ విషయాల్లో ఆయనతో సన్నిహితంగా పనిచేసే అలంకార్‌ సవాయ్‌, సచిన్‌రావుకు చెందిన తొమ్మిది నంబర్లపై నిఘా పెట్టారు. 2019ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘన కేసులో ప్రధాని మోదీకి నాటి సీఈసీ సునీల్‌ అరోరా క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం ద్వారా అశోక్‌ లావాసా వార్తల్లో నిలిచారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్‌పై పెగాసస్‌ ద్వారా నిఘా ఉంచారని, ఈ ఏడాది బెంగాల్‌ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఫోన్‌ను పెగాసస్‌ స్పైవైర్‌ ద్వారా హ్యాక్‌ చేసినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ నిర్వహించిన డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిందని వివరించింది. పార్లమెంట్ సమావేశాలకు ముందురోజే హ్యాకింగ్ అంశం బయటకు రావడం ఉద్దేశపూర్వక చర్యేనంటూ ఐటీ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించిన కొద్ది సేపటికే బాధితుల జాబితాలో ఆయన పేరు కూడా రావడం గమనార్హం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఫోన్‌ కూడా 2017లో హ్యాకింగ్‌కు గురైంది. అప్పటికి గుజరాత్‌లో మూడు కంపెనీలకు డైరెక్టర్‌‌గా ఉన్న ఆయన.. టెక్నాలజీకి సంబంధించి మోదీ నిర్ణయాల వెనుక కీలకంగా వ్యవహరించారు. ఫోన్ల హ్యాకింగ్ అంశంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. పడకగదుల్లో సంభాషణలు వింటూ అధికార బీజేపీ భారతీయ గూఢచారి పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేసింది.


By July 20, 2021 at 06:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-prashant-kishor-two-union-ministers-among-pegasus-targets/articleshow/84571739.cms

No comments