Breaking News

నేడే జగన్నాథుని రథయాత్ర.. పూరీలోకి నో ఎంట్రీ!


సుప్రసిద్ధ శ్రీక్షేత్రం పూరీ వేడుకలకు సర్వసిద్ధమయ్యింది. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు (చతురార్దమూర్తులు) నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాలపై గుండిచా మందిరానికి చేరుకోనున్నారు. రథాలను సేవలకు సిద్ధం చేసిన అధికారులు.. వాటిని దక్షిణాభిముఖంగా శ్రీక్షేత్రం ఎదుట నిలిపారు. శ్రీక్షేత్ర కార్యాలయం ఎదుట (బొడొదండొ) అక్షయ తృతీయ నుంచి ప్రారంభమైన రథాల తయారీ పనులు.. ఆదివారంతో పరిసమాప్తమయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి చతుర్థామూర్తుల పొహండి వేడుకలు చేపట్టనున్నారు. ఆదివారం నుంచే శ్రీక్షేత్రంలో జగన్నాథుని గోప్యసేవలు ఏర్పాటయ్యాయి. కీలకమైన ‘సేనాపట’ సేవను దైతాపతి సేవాయత్‌లు నిర్వహించారు. మరోవైపు పురుషోత్తముని నవయవ్వన (నేత్రోత్సవం) వేడుకలు జరుగుతున్నాయి. స్వర్ణాభరణాలతో ముగ్గురు మూర్తులను అలంకరించారు. ఒబడా (మహాప్రసాదం), మరో 56 రకాల పిండి వంటకాలు స్వామికి అర్పణ చేశారు. కొవిడ్‌ కారణంగా గతేడాది పూరీ రథయాత్రకు భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది కూడా కోవిడ్ వ్యాప్తిలో ఉన్నందున జగన్నాథుని రథయాత్ర పూరీకే పరిమితం చేసిన ప్రభుత్వం భక్తులు లేకుండా చేపడుతోంది. ప్రసార మాధ్యమాల ద్వారా వేడుకలను భక్తులు ఇళ్లల్లో కూర్చొని చూడాలని పేర్కొంది. ఇక, మూడు రథాలు శ్రీక్షేత్ర కార్డన్‌లో నిలిచిన తర్వాత భద్రతా బలగాలను నియమించారు. సోమవారం శ్రీక్షేత్రం లోపల, వెలుపల (రథాలపై) జగన్నాథుని సేవలు, పొహండి తదితరాలు నిర్ణీత వేళల్లో నిర్వహించాలని కోరారు. మరోవైపు, పూరీ పట్టణంలోకి ఎవరూ ప్రవేశించకుండా అన్ని దారులనూ మూసివేశారు. ఎటుచూసినా బలగాలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి రాకపోకలు రద్దు చేశారు. పూరీ రథయాత్రకు 500 మంది అధికారులు, 65 ప్లటూన్ల భద్రతా బలగాలను నియమించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 8 వరకు పట్టణంలో కర్ఫూ అమలు చేస్తున్నారు. బొడొదండొలోకి ఎవర్నీ అనుమతించేది లేదని, గుర్తింపు కార్డులు ఉన్నవారే రథయాత్ర విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు రథాలపై పూరీ శంకరాచార్య జగద్గురు నిశ్చలానంద సరస్వతి పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11 నుంచి 12లోగా పూరీ రాజు గజపతి దివ్య సింగ్‌దేవ్‌ చెరాపహరా, ఇతర సేవలు ఉంటాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు రథాలకు అశ్వాల అమరుస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత మూడు రథాలు గుండిచా మందిరంవైపు కదులుతాయి. సాయంత్రం గుండిచా మందిరానికి రథాలు చేరుకున్న తర్వాత రథాలపై ఇతర సేవలు ఉంటాయి.


By July 12, 2021 at 06:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/puri-jagannath-rath-yatra-2021-to-be-held-today-without-devotees/articleshow/84333598.cms

No comments