Breaking News

నా డేటా లీక్ అయ్యింది.. రూ.30 లక్షలు ఇవ్వండి: ఎయిరిండియాపై జర్నలిస్ట్ దావా


తమ ప్రయాణికుల సేవల వ్యవస్థపై హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడి.. భారీ స్థాయిలో డేటా చోరీకి పాల్పడినట్టు ఇటీవల ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సమాచారం లీక్ అయినందుకు గానూ రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియాపై కోర్టులో దావా వేశాడు. ఎస్ఐటీఏ‌పై సైబర్ దాడి జరిగి దాదాపు 45 లక్షల మంది ప్రయణాకిల డేటా లీక్ అయింది. వీరిలో ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ రితికా హండూ, ఆమె భర్త డేటా కూడా ఉండటంతో ఆమె పరిహారం డిమాండ్ చేశారు. తనకు ఎయిరిండియా రూ.30 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. కావాలనే తన సమాచారాన్ని లీక్ చేసి, గోప్యత హక్కును దెబ్బతీశారని ఆరోపించారు. కాబట్టి సదరు సంస్థ ఈ పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. డేటా లీక్ అయినట్టు రితికాకు ఎయిరిండియా జూన్ 1న సమాచారం ఇచ్చినట్టు ఆమె తరఫున లాయర్ తెలిపారు. ఇది నా హక్కులను హరించడమే, సమాచార స్వయంప్రతిపత్తికి విరుద్ధమని నోటీసులో పేర్కొన్నారు. ‘‘నా క్లయింట్ సున్నితమైన సమాచారం.. వ్యక్తిగత డేటాను లీక్ చేసినందుకు ఎయిరిండియా దోషి. ఇటీవలి భద్రతా లోపం గురించి నోటీసు ద్వారా తెలుసుకున్న ఆమె షాక్‌కు గురయ్యారు.. దీంతో నా క్లయింట్ అప్రమత్తమై డేటా చోరీకి పరిహారం కోరుతూ దావా వేశారు’’అని సీనియర్ న్యాయవాది అశ్వనీకుమార్ దూబే తెలిపారు. ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. ఇదిలా ఉండగా డేటా లీక్‌ కావడంతో ముంబయికి చెందిన జమాన్ అలీ అనే లాయర్ కూడా ఎయిరిండియాపై దావా వేశారు. తనకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, దీనిపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని అలీ కోరారు. ప్రయాణికుల సేవల వ్యవస్థ ‘ఎస్‌ఐటీఏ’పై ఫిబ్రవరిలో సైబర్‌ దాడులు జరగడంతో కొంత మంది వ్యక్తిగత సమాచారం లీక్‌ అయినట్టు మే నెలలో ఎయిరిండియా ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 26, 2011 నుంచి ఫిబ్రవరి 3, 2021 మధ్య పదేళ్లలో ప్రయాణికులకు సంబంధించిన పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబరు, పాస్‌పోర్టు, టికెట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాల సహా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయినట్టు పేర్కొంది. దీని ప్రభావం 45 లక్షల మంది కస్టమర్లపై పడిందని వివరించింది. సైబర్ దాడులు జరిగిన మూడు నెలల తర్వాత తొలిసారిగా ఎయిరిండియా వివరాలు వెల్లడించడం గమనార్హం. ‘మేము, మా డేటా ప్రాసెసర్‌ కలిసి పరిష్కార చర్యలు చేపడుతూనే ఉన్నాం. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని కోరుతూ ఉన్నా’మని తెలిపింది.


By July 05, 2021 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-journalist-seeks-30-lakh-compensation-for-air-india-data-leak/articleshow/84131505.cms

No comments