Breaking News

కొత్త ఐటీ చట్టం ప్రకారం యూజర్లపై ఫేస్‌బుక్ చర్యలు.. 3 కోట్లకుపైగా పోస్ట్‌ల తొలగింపు!


కొత్త ఐటీ నిబంధనల ప్రకారం నెల రోజుల్లో 30 మిలియన్లకుపైగా వివిధ రకాల కంటెంట్లను తొలగించినట్టు సోషల్ మీడియా దిగ్గజం వెల్లడించింది. కొత్త ఐటీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేయడంతో సోషల్ మీడియా సంస్థ‌లు ఈ మేర‌కు చ‌ర్యలు తీసుకుంటున్నాయి. తన తొలి నెలవారీ కంప్లయిన్స్‌ నివేదికను వెల్లడించిన ఫేస్‌బుక్.. పది కేటగిరీల్లో 30 మిలియన్లకుపైగా పోస్టులను తొలగించినట్టు పేర్కొంది. త‌మ‌ తదుపరి నివేదికను ఈ నెల 15న వెల్ల‌డిస్తామ‌ని చెప్పింది. యూజ‌ర్లు చేసిన‌ ఫిర్యాదులతో పాటు వాటిపై తీసుకున్న చర్యల వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేసింది. మే 15 నుంచి జూన్ 15 మధ్య తాము త‌మ సైట్లో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద దాదాపు 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్లు తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స్పామ్ పోస్టులు 25 మిలియన్లు, హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ అభ్యంత‌ర‌క‌ర‌ పోస్టులు 2.5మిలియన్లు, అశ్లీల‌, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్ల కంటెంట్లు ఇందులో ఉన్నాయ‌ని వివ‌రించింది. అలాగే, లక్షకుపైగా ఉగ్రవాద చ‌ర్య‌ల‌ ప్రచారానికి సంబంధించిన పోస్టులు, మూడు లక్షలకుపైగా విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్రసంగాలకు సంబంధించిన పోస్టులు, వేధింపులకు సంబంధించిన ల‌క్ష‌ల‌కుపైగా పోస్టులు ఇందులో ఉన్నాయ‌ని తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆయా సంస్థ‌లు ప్రతి నెలా కంప్లయిన్స్‌ నివేదికలను ప్రచురించాలి. ఫిర్యాదుల వివరాలతో పాటు వాటిపై తీసుకున్న చర్యలను తెలియజేయాల్సి ఉంటుంది. ఫేస్‌బుక్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘తమ వినియోగదారులను సురక్షితంగా, ఆన్‌లైన్‌లో భద్రంగా ఉంచడం, ప్లాట్‌ఫామ్‌లో తమ అభిప్రయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలు కల్పించే ఎజెండాను మరింతగా పెంచడానికి టెక్నాలజీ, ప్రక్రియలలో స్థిరమైన పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది’ అని తెలిపారు. ‘‘మేం మా పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను గుర్తించడానికి.. సమీక్షించడానికి కృత్రిమ మేధస్సు, మా సంస్థ నివేదికలు, మా బృందాలను ఉపయోగిస్తాం..ఈ నివేదికను అభివృద్ధి చేస్తున్నప్పుడు మరింత సమాచారాన్ని జోడించడం.. పారదర్శకంగా రూపొందించడం కొనసాగిస్తాం’’ అని ప్రతినిధి వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి నివేదికను జులై 15న వెలువరిస్తామని పేర్కొన్నారు. ‘డేటా సేకరణ, ధ్రువీకరణకు తగినంత సమయాన్ని కేటాయించి 30-45 రోజుల వ్యవధిలో నివేదిక తదుపరి సంచికలను ప్రచురించాలని మేము భావిస్తున్నాం.. ఈ విషయంలో మరింత పారదర్శకత పాటిస్తాం.. భవిష్యత్ నివేదికలలో మా ప్రయత్నాల గురించి మరింత సమాచారాన్ని చేర్చుతాం’ అని అన్నారు.


By July 03, 2021 at 12:14PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/facebook-actioned-over-30-million-posts-in-compliance-with-new-it-rules/articleshow/84088405.cms

No comments