Breaking News

ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్‌ను పట్టిస్తే రూ.22 కోట్ల నజరానా.. వైరల్ అవుతోన్న పోలీసుల పోస్ట్


ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ను పట్టించిన వాళ్లకు రూ.22 కోట్ల బహుమతి ఇస్తామని కొలంబియా పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ జుకర్‌బర్గ్‌ చేసిన తప్పేంటి.. ఆయనపై రివార్డు ప్రకటించడం? ఏంటని షాక్‌ అవుతున్నారా? ఈ పోస్ట్ నిజమే కానీ, పట్టించాల్సింది జుకర్‌‌బర్గ్‌ను కాదు ఆయన పోలికలతో ఉన్న మరో వ్యక్తిని. కొలంబియా పోలీసులు ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. దీని వెనుక కథ వేరే ఉంది. కొద్ది రోజుల కిందట ఇవాన్‌ డ్యూక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. దీంతో నిందితులను పట్టుకోడానికి గాలిస్తున్న పోలీసులు.. అనుమానితుడి స్కెచ్ గీయించారు. అతడు అచ్చం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ను పోలి ఉండటం గమనార్హం. ఈ ఫోటోను కొలంబియా నేషనల్ పోలీసులు విడుదల చేశారు. అనుమానితుడి వివరాలను తెలియజేస్తే 3 మిలియన్ డాలర్లు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ దాడితో జుకర్‌బర్గ్‌కు ఎటువంటి సంబంధం లేకపోయిన అనుమానితుడు ఆయన పోలికలతో ఉండటం వల్ల ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్, అతడి మంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దాడిచేసిన వ్యక్తులు ఆనవాళ్లు ఇవి.. అతడి ఆచూకీ గుర్తించడానికి సహకరించండి.. 3 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంటుంది.. 3213945367 లేదా 3143587212 నెంబర్లను సంప్రదించండి’’ అని పోస్ట్ పెట్టారు. అయితే, ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ.. మార్క్ జుకర్‌బర్గ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ పోస్ట్‌కు 25 వేల షేర్లు రాగా.. 70 వేల వరకూ కామెంట్లు వచ్చాయి. చాలా మంది ప్రజలు జుకర్‌బర్గ్ అసలు ఫోటోను, నేరస్తుడి ఊహా చిత్రాన్ని కలిపి షేర్ చేస్తున్నారు. మరికొంత మంది కామెంట్లలో నేరుగా జుకస్ బర్గ్‌ను ట్యాగ్ చేస్తున్నారు. ఇక, నార్టే డి శాంటాండర్ ప్రావిన్స్ రాజధాని కుకుటా నగరానికి అధ్యక్షుడు డ్యూక్ బయలుదేరారు. కొలంబియా అధ్యక్షుడిపై దాడి వెనుక డ్రగ్స్ మాఫియా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇటువంటి దాడులకు భయపడబోమని, డ్రగ్స్ అక్రమరవాణా, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలపై పోరాటం కొనసాగుతుందని కొలంబియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడి నుంచి అధ్యక్షుడు, మంత్రులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, హెలికాప్టర్‌ను భద్రంగా సైనిక వలయంలో దింపారు.


By July 04, 2021 at 03:22PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/colombia-police-released-a-suspects-sketch-and-compared-him-with-fb-founder-mark-zuckerberg/articleshow/84113390.cms

No comments