మహారాష్ట్రలో వరద బీభత్సం.. 129 మంది మృతి.. వందల మంది గల్లంతు
వరుణుడి బీభత్సానికి మహారాష్ట్ర చిగురుటాకులా వణుకుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్ ప్రాంతంలో ఒక్క రోజులోనే రికార్డుస్థాయిలో 60 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. రెండు రోజుల్లో 108 సెం.మీ. వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రాయ్‌గఢ్ జిల్లాలోనే 36 మంది చనిపోయారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొంకణ్ తీరం అతలాకుతలమయ్యింది. నదులకు వరద పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది చిక్కకున్నారు. ‘రాయ్‌గఢ్ జిల్లాలోని తైలయే గ్రామంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 33 మృతదేహాలను వెలికితీశారు.. మరో 52 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.. చీకటి పడటంతో శుక్రవారం రాత్రి నిలిపివేసిన సహాయక చర్యలను తిరిగి శనివారం ఉదయం ప్రారంభించారు’ అని మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. అటు సతారా జిల్లాలోనూ కుండపోత వర్షాలకు వరదలు సంభవించి పలువురు కొట్టుకుపోయారు. అక్కడ 27 మంది ఇప్పటి వరకూ చనిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు. గొండియా, చంద్రపూర్‌లోనూ భారీ ప్రాణనష్టం సంభవించింది. పశ్చిమ మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలో 40వేల మంది సహా మొత్తం 84,452 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుణే డివిజన్‌లోని 54 గ్రామాలు వరదలకు తీవ్ర ప్రభావితం కాగా.. 821 గ్రామాల్లో పాక్షికంగా ప్రభావితమయ్యాయి. కొల్హాపూర్‌లో పంచగంగా నదిలో వరద గరిష్ఠ నీటిమట్టం దాటి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. కొల్హాపూర్ జిల్లాలో బస్సులోని 11 మంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వంతెనపై నుంచి బస్సు వెళ్తుండగా వరద నీరు పోటెత్తి వాహనం కొట్టుకుపోయింది. అప్పటికే అందులోని ప్రయాణికులు దిగిపోవడంతో ముప్పు తప్పింది. రాయ్‌గఢ్ జిల్లా సహా సతారాలోని అంబేఘర్, మిరగావ్ గ్రామల్లో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడి పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సైన్యం, నేవీకి చెందిన ఆరు బృందాలు శనివారం సహాయక చర్యల్లో పాల్గొంటాయని అధికారులు తెలిపారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు.
By July 24, 2021 at 10:35AM
No comments