కరోనా కాలంలో రైతులకు ఆసరా.. కిసాన్ మిత్రా యోజన కింద నెలకు రూ.1,000
కరోనా మహమ్మారి కారణంగా రైతులపై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు, పంటలకు సరైన ధర రాక అన్నదాతలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులను అదుకోడానికి రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. కర్షకులకు నెలకు రూ.వెయ్యి సాయం అందించే పథకాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శనివారం ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి కిసాన్ మిత్రా ఎనర్జీ యోజన’ పథకం కింద ఈ మొత్నాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా సీఎం ట్వీట్ చేస్తూ.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి గరిష్ఠంగా రూ.12వేలు అందిస్తామని తెలిపారు. కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన పేరుతో ప్రారంభమైన ఈ పథకానికి ఏటా రూ.1,450 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వివరించారు. ‘రైతుల సంక్షేమ తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత.. ఇందులో భాగంగా కర్షకుల సంక్షేమం, సంతోషం కోసం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం.. తాజాగా ‘ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన’ ప్రారంభిస్తున్నాం’ అన్నారు. ‘ఈ పథకం ప్రయోజనం గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ వ్యవసాయ వినియోగదారులకు అందుబాటులో వస్తుంది.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ .1,450 కోట్ల అదనపు నిధులు అందజేస్తుంది’ అని సీఎం తెలిపారు. నెల నెల నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ఈ నగదు బదిలీ చేస్తారు. ఈ ఏడాది మే నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ పథకం కింద 15 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా కూడా ఇటువంటి పథకం చేపట్టారు. వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులకు నెలకు రూ.833 అందజేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలుపుదల చేసిన అశోక్ గెహ్లాట్.. దీనిని రూ.1,000కి పెంచుతామని ప్రకటించారు. రెండేళ్ల తర్వాత ఆ హమీని తాజాగా ఆయన అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గతవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 17 నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
By July 19, 2021 at 09:18AM
No comments