Breaking News

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ‘RRR’ థీమ్‌తో కార్యక్రమాలు


గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం భూమండలాన్ని కాలుష్య కాసారంగా మార్చివేస్తోంది. ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ సంపదలను ప్రపంచ దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపం పెరగడంవల్ల పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వృక్షాలను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ తీసుకట్టుగా మారుతున్నాయి. వాతావరణ సంక్షోభం మన జీవితాల్లో కొన్ని కోలుకోలేని మార్పులను చేస్తున్నందున, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ నిర్మూలన, ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేకమైన పరిష్కారాలను ఈరోజు చర్చిస్తుంది ఐక్యరాజ్యసమితి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏటా జూన్ 5న నిర్వహిస్తున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు చేపట్టి ప్రపంచ అవగాహనను పెంచేలా ఐరాస ఈమేరకు పర్యావరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా వీటిని నిర్వహిస్తున్నారు. 1972 జూన్ 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేసింది. 1973లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. ఏటా ఒక్కో థీమ్‌ను ఎంపిక చేసి పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు. 1974లో తొలిసారి ‘ఒకే ఒక్క భూమి’ థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. 2020లో ‘టైమ్ ఫర్ నేచర్.’ జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు. ఈ ఏడాది RRR థీమ్‌తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. “Reimagine.. Recreate.. Restore” (పునరాలోచన.. పున:సృష్టి.. పునరుద్ధరణ) ‘‘పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ' అనేది 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి థీమ్. ఐరాస ప్రకారం.. మానవాళి జీవనశైలిలో చిన్న మార్పులను తీసుకురావడానికి సంకల్పించాలి.. ఇది సహజ వనరులను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ప్లాస్టిక్‌పై నిషేధం లేదా నగరాల్లోని కాంక్రీట్ జంగిల్స్‌లో పచ్చదనం నింపడం వంటి చర్యలను చేపట్టి, సహాయపడే మార్గాలను పున:సృష్టించుకుని, పునరుద్ధరించుకోవాలన్నది దీని ఉద్దేశం’’


By June 05, 2021 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/history-significance-importance-and-theme-of-world-environment-day-in-telugu/articleshow/83252689.cms

No comments