భర్తను కాదని వేరొకరితో సహజీవనం.. మహిళకు షాక్ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు
పెళ్లయిన ఓ మహిళ మరో వ్యక్తితో సహజీవనం విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. ఓ వివాహిత మరొకరితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గీతా అనే ఓ వివాహిత, ఆమె ప్రియుడు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితంలో భర్తగానీ, ఇతరులుగానీ సమస్యలు కలిగించకుండా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కౌశల్ జయేంద్ర ఠాకెర్, జస్టిస్ దినేశ్ పాఠక్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, కానీ అది చట్టం పరిధిలో ఉండాలని స్పష్టం చేసింది. సమాజంలో చట్టవ్యతిరేక చర్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిటిషన్‌ను ఎలా అంగీకరించగలమని ప్రశ్నించింది. భర్త వల్ల ఏమైనా ఇబ్బందులుంటే తొలుత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని పేర్కొంది. కానీ అలా జరగలేదని వ్యాఖ్యానించింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలన్న పేరుతో వివాహేతర సంబంధానికి అనుమతించలేమని స్పష్టం చేసింది. ఇది హిందూ వివాహ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమైన చర్యని, ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులకు రక్షణ కల్పించడం సాధ్యంకాదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాదు, వారికి వారికి రూ.5000 జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని యూపీ రాష్ట్ర న్యాయ సేవలకు చెల్లించాలని సూచించింది. ఐపీసీ సెక్షన్ 377 (అసహజ నేరాలు) కింద భార్య పట్ల భర్త పాల్పడే నేరాల గురించి కూడా ఈ పిటిషన్‌లో మాట్లాడారు. ‘ఒకవేళ సదరు మహిళ భర్త ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరంగా పరిగణిస్తాం.. అయితే, ఆమె భర్తపై ఎటువంటి ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.. ఇవన్నీ వివాదాస్పదమైన వాస్తవాలు.. ఎఫ్‌ఐఆర్ లేదు’ అని అభిప్రాయపడింది.
By June 18, 2021 at 09:42AM
No comments