జమ్మూ ఎయిర్ స్టేషన్‌పై డ్రోన్ల దాడి.. జైషే మహ్మద్ ఉగ్రవాదుల హస్తం?
అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉండే జమ్మూ విమానాశ్రయంలోని వాయుసేన స్థావరంపై ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ల దాడిపై దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. భారత వైమానిక స్థావరంపై తొలిసారి జరిగిన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది ఉగ్రదాడేనని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ప్రకటించారు. ఈ దాడిపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు, పోలీసులతో పాటు...ఇతర జాతీయ భద్రత సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై ఉగ్రవాద వ్యతిరేక నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. కాగా, మరో ఉగ్రకుట్నను భగ్నం చేశామని, లష్కరే తొయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే, డ్రోన్ల దాడితో దీనికి సంబంధం లేదని అన్నారు. జనసమూహం గుమిగూడి ఉండే ప్రదేశంలో ఐఈడీని అమర్చేందుకు ఉగ్రవాది పథకం వేశాడని పేర్కొన్నారు. ఆరు నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ జంట పేలుళ్లు.. వైమానిక స్థావరంలోని హ్యాంగర్ సమీపంలో జరిగాయి. ఈ హ్యాంగర్లలోనే యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో జమ్ము స్థావరంలోని ఎంఐ17 హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాదు, ఈ డ్రోన్లు పాక్ నుంచి వచ్చాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. సరిహద్దుల్లో డ్రోన్ల సాయంతో ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు చేరవేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది. చాలా సార్లు పాక్ భూభాగం నుంచి వచ్చిన డ్రోన్లను భారత బలగాలు నేలకూల్చాయి. ఈ నేపథ్యంలో తాజా దాడి జీపీఎస్ అధారంగా జరిగిందని, డ్రోన్లను భారత్ భూభాగం నుంచే నియంత్రించారని వార్తలు వచ్చాయి. అయితే పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ, ఐఎస్‌ఐపైనే అధికారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా దాడి జరిగిన వైమానిక స్థావరం పాకిస్థాన్ సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జమ్మూ విమానాశ్రయం నుంచి ప్యాసింజర్ విమానాలు రాకపోకలు, వాయుసేన వైమానిక స్థావరంగానూ రెండు విధాలుగా ఉపయోగిస్తున్నారు. దాడి తర్వాత ప్రయాణికుల విమానాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని జమ్మూ విమానాశ్రయం డైరెక్టర్ ప్రవాత్ రంజన్ బెవరియా తెలిపారు.
By June 28, 2021 at 08:49AM
No comments