Breaking News

కమలా హ్యారిస్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. విమానం అత్యవసర ల్యాండింగ్


కమలా హ్యారిస్‌ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉపాధ్యక్షురాలి హోదాలో తొలి విదేశీ పర్యటనకు కమలా ఆదివారం విమానంలో బయలుదేరి వెళ్లారు. అయితే, టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని పైలట్ మేరీల్యాండ్‌ విమానాశ్రయంలో అర్ధాంతరంగా దింపేయాల్సి వచ్చింది. పైలట్ ముందుగానే లోపాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. తాను క్షేమంగా ఉన్నానని మీడియాకు తెలిపారు. అనంతరం మరో విమానంలో ఆమె గ్యాంటెమాలాకు వెళ్లారు. ‘‘మేమంతా ఒక చిన్న ప్రార్థన చేశాం.. కానీ, క్షేమంగా ఉన్నాం’’ అని కమలా పేర్కొన్నారు. మరో విమానంలో గ్వాంటెమాలాకు ఆదివారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షురాలు సురక్షితంగా చేరుకున్నట్టు ఆమె అధికార ప్రతినిధి సైమోనే శాండెర్స్ తెలిపారు. అంతేకాదు, పర్యటన షెడ్యూల్‌కు కూడా పెద్ద జాప్యం జరగలేదని అన్నారు. ‘‘ల్యాండింగ్ గేర్ సక్రమంగా పనిచేయకపోవడాన్ని సిబ్బంది గమనించారు.. ఇది మరింత సాంకేతిక సమస్యలకు దారితీస్తుంది... తక్షణ భద్రతా సమస్య లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఆండ్రూస్కూ జాయింట్ బేస్‌కు తిరిగొచ్చారు’’ అని శాండర్ పేర్కొన్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ల్యాండింగ్ గేర్‌లో అసాధారణ శబ్దం వచ్చినట్టు విమానంలో ఉన్న ఓ జర్నలిస్ట్ చెప్పారు. కానీ, ఆండ్రూస్కూ బేస్‌లో ఎయిర్‌ఫోర్స్ టూ సాధారణంగానే దిగింది. కమలా హ్యారిస్ ఈ వారం గ్యాంటెమాలా, మెక్సికోలో పర్యటించనున్నారు. కోవిడ్-19కు తీవ్రంగా ప్రభావితమైన ఈ దేశాలకు భరోసా కల్పించేలా కమలా పర్యటన సాగనుంది. ఇక, ఈ రెండు దేశాలకు చెందిన వలసదారులే అక్రమంగా అమెరికాలోని ప్రవేశిస్తున్నారు. ఈ సరిహద్దుల్లోనే రక్షణ గోడ నిర్మాణానికి గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిధులు మంజూరు చేశారు. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఈ ప్రాజెక్టును రద్దుచేశారు.


By June 07, 2021 at 10:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-vice-president-kamala-harris-flight-forced-to-land-soon-after-take-off/articleshow/83299833.cms

No comments