Breaking News

మహారాష్ట్రలో డెల్టా ప్లస్ తొలి మరణం.. ఆంక్షలపై ఉద్ధవ్ సర్కారు కీలక ఉత్తర్వులు


కోవిడ్ రెండో దశ వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ‘డెల్టా ప్లస్’ రూపంలో ముప్పు ముంచుకురావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు మొత్తం 51 నమోదుకాగా.. తొలి మరణం మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పదకొండు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గుర్తించగా.. ఒక్క మహారాష్ట్రలోనే 21 కేసులున్నాయి. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం చోటుచేసుకున్నట్టు మహారాష్ట్ర శుక్రవారం ప్రకటించింది. డెల్టా ప్లస్ వేరియంట్ నిర్ధారణ అయిన ఓ వృద్ధురాలు.. రత్నగిరి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో అన్‌లాక్ ప్రక్రియపై మహా సర్కారు పునరాలోచనలో పడింది. శుక్రవారం అత్యవసర ఉత్తర్వులు జారీచేసింది. వీక్లీ పాజిటివిటీ రేటు, అందుబాటులో ఉన్న ఆస్పత్రి పడకలతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లోనూ లెవెల్-3 ఆంక్షలను విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారామ్ కుంతే ఆదేశాలు జారీచేశారు. ‘‘కోవిడ్‌కు కారణమయ్యే సార్స్-కోవి-2 వివిధ భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా ఉత్పరివర్తనాలకు గురవుతోంది.. ఈ మ్యుటేషన్లు మరింత వేగంగా వ్యాప్తిచెందుతూ మోనోక్లోనల్ యాంటీబాడీల ప్రతిస్పందనలను కూడా తగ్గిస్తున్నాయి.. వీక్లీ పాజిటివిటీ రేటు, అందుబాటులోని ఆక్సిజన్ పడకలతో సంబంధం లేకుండా రాష్ట్రస్థాయిలో పడకల ఆక్యుపెన్సీ శాతం 3 కంటే తక్కువకు చేరే వరకూ నిర్దిష్ట క్రమం ద్వారా ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి’’ అని పేర్కొన్నారు. లెవెల్-3 ఆంక్షల ప్రకారం.. రెస్టారెంట్లు, జిమ్స్, సెలూన్, స్పాలలో 50 శాతం కెపాసిటీతో సాయంత్రం 4 గంటల వరకూ అనుమతిస్తారు. ప్రయివేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది, వివాహాలు, వేడుకలకు 50 మంతి అతిథులు, అంత్యక్రియల్లో 20 మంది మాత్రమే పాల్గొనాలి. మాల్స్, థియేటర్లు మూసివేస్తారు. దేశంలో రెండో దశకు కారణంగా భావిస్తున్న డెల్టా కంటే వేగంగా డెల్టా ప్లస్ వ్యాప్తి చెందగలదని, ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీసి మోనోక్లోనల్ యాంటీబాడీలను తప్పించుకునే లక్షణాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్‌ను సమర్ధంగా ఎదుర్కొవాలంటే 70 శాతం మంది జనాభాకు తక్షణమే వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రయత్నాలు చేయాలని నిపుణులు అంటున్నారు. అయితే, థర్డ్ వేవ్‌కు కొత్త వేరియంట్ కారణమవుతుందనడానికి ఎటువంటి ఆధారాల్లేవని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ అన్నారు.


By June 26, 2021 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-govt-holds-off-on-unlock-plan-reports-1-death-due-to-delta-plus/articleshow/83864854.cms

No comments