Breaking News

అభివృద్ధి పేరుతో అశాంతికి బీజం.. లక్షద్వీప్ రచ్చపై మోదీకి మాజీ ఐఏఎస్‌లు లేఖ


ప్రకృతి అందాలకు, బీచ్‌లకు నిలయమైన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ నిరసనలతో హోరెత్తిపోతోంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్ కె. పటేల్ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా లక్షద్వీప్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అక్కడ ప్రజల ఆందోళనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మలయాళీ హీరోలు, సెలెబ్రిటీలు, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు అండగా నిలబడి ప్రఫుల్ పటేల్‌ను వెనక్కు పిలవాలంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి లేఖలు రాశారు. తాజాగా, ప్రతిపాదనలకు వ్యతిరేకిస్తూ దాదాపు 100 మంది రిటైర్డ్ ఐఏఎస్‌లు ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేము.. కానీ, భారత రాజ్యాంగం పట్ల తటస్థత, నిబద్ధతను నమ్ముతామని పేర్కొన్నారు. ‘‘అభివృద్ధి పేరుతో ప్రశాంతతకు మారుపేరైన లక్షద్వీప్‌లో అశాంతిని ప్రేరేపించేలా తీసుకున్న నిర్ణయాలపై ఆందోళన చెందుతున్నాం’’ అని తెలిపారు. వివాదాస్పద ముసాయిదా నిబంధనలలో ప్రతి ఒక్కటి ద్వీపం, ద్వీపవాసుల ప్రయోజనాలకు విరుద్ధమైనవని స్పష్టం చేశారు. అక్కడ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. ‘‘లక్షద్వీప్ పర్యావరణాన్ని సమాజాన్ని గౌరవించే వ్యవస్థీకృత పద్ధతులను ఉల్లంఘిస్తూ ఏకపక్ష విధానాలకు రూపకల్పన చేశారు.. ఇది అభివృద్ధి కాదు.. ద్వీపవాసులతో సంప్రదింపులు జరపుకుండా తీసుకున్న నిర్ణయాలు.. లక్షద్వీప్ సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిపై మీద దాడి చేయడమే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బయటి ప్రపంచం నుంచ పెట్టుబడిదారులు తీసుకురావడమే’’ అని మండిపడ్డారు. నేరాలు రేటు స్వల్పంగా ఉండే లక్షద్వీప్‌లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ బిల్-2021 పేరుతో కఠిన చట్టం, అభివృద్ధి కార్యక్రమాలు, టౌన్ ప్లానింగ్ కోసం దీవుల్లోని ప్రజల నుంచి వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్-2021 తీవ్ర వివాదాస్పదమైంది. మితిమీరిన అభివృద్ధి, భవన నిర్మాణాల వల్ల దీవుల సహజ సౌందర్యం కూడా దెబ్బ తింటుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, దీవుల్లో మద్యం విక్రయాలకు అనుమతులిచ్చారు. ఇప్పటి వరకూ లక్షద్వీప్‌లో కేవలం ఒక్క దీవిలోనే మద్యం అమ్మకం జరిగేది. అయితే ప్రఫుల్ తాజా ప్రతిపాదనతో అన్ని దీవుల్లోని రిసార్టుల్లో మద్యం అమ్ముకోవచ్చు. ప్రఫుల్ ప్రతిపాదంచిన పంచాయతీ రాజ్ మార్గదర్శకాల ప్రకారం, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉన్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇప్పటికే ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు.. ఇకపై పిల్లలను కనకపోతే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఇక్కడ ముస్లిం జనాభా అధికం. ముస్లింలలో సంతానం కూడా అధికంగానే ఉంటుంది. దీంతో వీరిని టార్గెట్ చేసి ఈ చట్టం చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో వివాదం మరింత తీవ్రతరం అయింది.


By June 06, 2021 at 03:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/disturbing-developments-in-lakshadweep-top-ex-bureaucrats-write-to-pm-modi/articleshow/83280509.cms

No comments