Breaking News

ఉద్యోగులు టీకా వేసుకోకుంటే జీతాలు కట్.. సీఎం సంచలన ఆదేశాలు!


కోవిడ్ టీకా విషయంలో అలసత్వం ప్రదర్శించే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠిన చర్యలకు పాకిస్థాన్ సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్అలీ షా ఉపక్రమించారు. వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిపివేయనున్నట్టు సీఎం సంచలన ప్రకటన చేశారు. టీకా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జులై నెల నుంచి జీతాలు నిలిపివేయాలని ఈ మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కొవిడ్ టీకాలు వేయించుకోనివారికి వచ్చే నెల నుంచి జీతాలు చెల్లించరాదని పాక్ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. సింధ్ ప్రావిన్సుల కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, వైద్య నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా... ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్ కోసం జూన్ నెల సమయం ఇవ్వాలని సీఎస్‌కు మురాద్‌అలీ షా సూచించారు. కోవిడ్ టీకా ప్రజలకు తప్పనిసరిని ప్రకటించారు. పౌరుల భద్రత కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నారు. జూన్ 7 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నందున జూన్ 5లోగా ఉపాధ్యాయులందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని సింధ్ సర్కారు ఆదేశించింది. సింధ్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,550,553 మందికి టీకా వేయగా.. 4,29,000 మంది రెండు డోసుల వేయించుకున్నారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడానికి అదనంగా 300 టీకా కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. రోజుకు 30,000 మందికి వ్యాక్సిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కోసం ప్రతి తాలూకాకు 5 చొప్పున మొబైల్ వ్యాక్సినేషన్ టీమ్‌లను అదనంగా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. వీటి ద్వారా రోజుకు 60వేల మందికి టీకాలు వేయాలని తెలిపారు. కాగా, పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 9,26,695 మందికి కరోనా సోకగా, 21,022 మంది ప్రాణాలు కోల్పోయారు. సింధ్ రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో టీకాలు వేయించుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని ఆ రాష్ట్రం ప్రకటించింది.


By June 04, 2021 at 06:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistans-sindh-cm-orders-to-stop-salaries-of-govt-employees-who-refuse-covid-19-vaccines/articleshow/83222770.cms

No comments