ఎంపీనే బోల్తా కొట్టించిన కేటుగాడు.. నకిలీ టీకాతో నటికి అస్వస్థత
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో టీకా వేయించుకున్న టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఐఏఎస్ అధికారిగా నమ్మించి దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి మిమి చక్రవర్తిని కోల్‌కతా సమీపంలో కస్బా వద్ద నిర్వహించిన ఓ టీకా కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రజలకు మేలు చేసే పనికావడంతో అతడి ఆహ్వానాన్ని మన్నించి ఆమె హాజరయ్యారు. అంతేకాదు, టీకాపై ప్రజల్లో నెలకున్న అపోహాలు, భయాలను తొలగించేందుకు ఆమె కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ తర్వాత అది నకిలీ కార్యక్రమమని గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో అప్పటి నుంచి అతడు పంపిణీ చేసిన టీకాలపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ టీకా తీసుకున్న రెండు రోజుల తర్వాత ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. డీహైడ్రేషన్, కడుపునొప్పి, బీపీ తగ్గిపోవడంతో ఆమెను ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే, ఈ పరిస్థితికి టీకానే కారణమని మాత్రం వైద్యులు ధ్రువీకరించలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన వైద్యులు.. ఆమె కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్టు గతంలో నిర్ధారించారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో వాడిన వయల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా.. ఫలితాలు నాలుగైదు రోజుల్లో రానున్నాయి. నిందితుడు దేబాంజన్ దేవ్ రెండు వ్యాక్సిన్ కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇందులో వేలాది మంది టీకాలు వేసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసిన సమయంలో టీకా నకిలీ లేబుల్స్, యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎంపీ మిమి చక్రవర్తి టీకా తీసుకున్న తర్వాత మెసేజ్ రాకపోవడంతో అనుమానించారు. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో నకిలీ వ్యాక్సినేషన్ గుట్టురట్టయ్యింది. నిందితుడు తాను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ జాయింట్ కమిషనర్‌గా పరిచయం చేసుకుని, ఎంపీనే బోల్తా కొట్టించాడు. వ్యాక్సినేషన్‌కు సహాయం చేయాలనే నెపంతో పలువురి నుంచి లక్షలు కాజేశాడు. ఈ డబ్బుతో నకిలీ వ్యాక్సిన్ క్యాంపులు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నకిలీ టీకా కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణించారు. దీంతో సంబంధం ఉన్నవారందరిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే దేవాంజన్‌పై హత్యాయత్నం కింద కేసునమోదైంది. మరోవైపు, నిందితుడితో తృణమూల్ నేతలు సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగులోకి రావడంతో.. సీబీఐ దర్యాప్తునకు బీజేపీ డిమాండ్ చేసింది. ముంబయిలో కూడా ఈ తరహా నకిలీకార్యక్రమం ఒకటి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By June 27, 2021 at 10:09AM
No comments