జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలకు ఒకే.. కానీ....: అఖిలపక్ష భేటీలో కేంద్రం మెలిక
జమ్మూ కశ్మీర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కశ్మీర్‌లో క్షేత్రస్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ త్వరగా పూర్తయితే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు. తద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని పేర్కొన్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, బీజేపీ సహా ఎనిమిది పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన తొలి భేటీ ఇదే. దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశం సుహృద్భావ వాతావరణంలో కొనసాగిందని ఇరు వర్గాలు వేర్వేరుగా ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న నేతల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాపు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజనకు ఎన్నికలకు ముడిపెట్టింది. ఈ ప్రక్రియను గతంలో మాదిరిగా కశ్మీరీ లోయ పార్టీలు వ్యతిరేకించకపోవడం గమనార్హం. భేటీ అనంతరం వరుస ట్వీట్లు చేశారు. ఈ భేటీని ‘జమ్మూ-కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి సంప్రదింపుల ప్రక్రియ కీలకమైన ముందడుగు’గా అభివర్ణించారు. ఇక, జమ్మూ-కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, పార్లమెంటులో ఇచ్చిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీ సాకారానికి నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు, ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కీలక అంశాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కాగా, ‘జమ్మూ-కశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించి ప్రజల్లో విశ్వాసం కల్పించాలని ప్రధానిని కోరినట్టు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పునర్విభజన అంశం కొలిక్కి వస్తే ఈ ఏడాది డిసెంబరులో లేదా వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్రం యోచనగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
By June 25, 2021 at 10:46AM
No comments