Breaking News

మహారాష్ట్ర మాజీ హోం మంత్రికి ఈడీ షాక్.. ఇద్దరు సహాయకులు అరెస్ట్


మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, ఎన్‌సీపీ నేత సహాయకులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం ఉదయం అదుపులోకి తీసుకుంది. మనీల్యాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ సహాయకులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండే‌లను శుక్రవారం అదుపులోకి తీసుకుని తొమ్మిది గంటల పాటు విచారించింది. అనంతరం ఇరువురినీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసింది. శుక్రవారం ఈడీ ఎదుట ముంబయిలో బల్లార్డ్ ఎస్టేట్‌లోని కార్యాలయంలో సంజీవ్ పలాండే, కుందన్ షిండేలు హాజరయ్యారు. అయితే, విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని, దర్యాప్తునకు సహకరించలేదని ఈడీ ఆరోపించింది. అందుకే ఇరువురినీ అరెస్ట్ చేసినట్టు తెలిపింది. మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేయాలని పేర్కొంది. అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో అనిల్ దేశ్‌ముఖ్ ఏప్రిల్ తొలివారంలో హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రిపై సాక్షాత్తూ పోలీస్ బాస్ ఆరోపణలు చేయడాన్ని అసాధారణమైన, అపూర్వమైనదిగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.


By June 26, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-aides-of-ex-minister-anil-deshmukh-arrested-in-money-laundering-case/articleshow/83863871.cms

No comments