Breaking News

AIIMS Fire ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 22 ఫైర్ ఇంజిన్లు


ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిమ్స్ భవనం తొమ్మిదో అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లో రోగులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇప్పటి వరకూ ఎవరూ గాయపడలేదని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి 10.32 గంటలకు ప్రమాదం గురించి సమాచారం అందినట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మంటలను ఆర్పడానికి మొత్తం 22 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపారు. ఎయిమ్స్ కన్వర్జెన్స్ బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇందులో పలు డయాగ్నిస్టిక్ ల్యాబొరేటరీలు, ఎగ్జామినేషన్ విభాగాలు ఉంటాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం తొమ్మిదో అంతస్తులోని ఓ రిఫ్రిజిరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. అర్ధరాత్రి వరకూ మంటలను అదుపులో తెచ్చాయి. లొపలి ఉన్న అందర్నీ రక్షించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం కలవరానికి గురిచేస్తోంది. గతవారం లజపత్ నగర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగి భారీ ఆస్తి నష్టం సంభవించింది. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్ బ్లాక్ 1 సమీపంలోని ఓ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.


By June 17, 2021 at 06:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fire-broke-out-in-delhi-aiims-convergence-block-22-fire-engines-at-site-everyone-rescued/articleshow/83592857.cms

No comments