Breaking News

ముంబయి: పెను విషాదం.. భారీ వర్షాలకు భవనం కూలి 9 మంది మృతి


మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ముంబయిలోని మల్వానీలో బుధవారం అర్ధరాత్రి రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. కనీసం 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనం కూలిన సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ శిథిలాల నుంచి 15 మందిని రక్షించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని సాయం అందజేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం కాండివలీలోని బీడీబీఏ మున్సిపల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలవల్లే భవనం కూలినట్లు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌ తెలిపారు. గత రెండు రోజులుగా ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలోని మూడంతస్తుల భవనం నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. ‘భవనం కూలిన ఘటనలో 17 మంది గాయపడగా.. వారిలో తొమ్మిది మంది చనిపోయారు.. ఎనిమిది మందికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది’ అని ఓ వైద్యుడు తెలిపారు. బీఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 11.10 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో తరుచూ ఇటువంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. సరిగ్గా పది రోజుల కిందట థానేలో ఓ భవనం కూలిపోయి ఏడుగురు ప్రాణాలు కోల్పోయాయి. థానే జిల్లా ఉల్హాస్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూ చౌక వద్ద మే 29న సాయి సిద్ధి ఐదంతస్తుల భవనం స్లాబ్ కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మే 15న ఉల్హాస్‌నగర్ క్యాంప్‌లోని మోహిని ప్యాలెస్ భవనం కూటి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 ఏళ్ల చిన్నారి కూడా ఉంది.


By June 10, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nine-killed-and-eight-injured-as-residential-building-collapses-in-mumbai/articleshow/83388988.cms

No comments