Breaking News

మిజోరంలో కొత్త వైరస్.. 4800 పందులు మృతి, మనుషులకు సోకుతుందా?


కరోనా వైరస్‌తో దేశం అతలాకుతలం అవుతున్న వేళ కొత్త వైరస్‌లు మరింత భయపెడుతున్నాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ (ఏఎస్‌ఎఫ్‌) వైరస్ కలకలం రేపుతోంది. పందులకు సోకే ఈ వైరస్‌తో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. దీని ప్రభావంతో రెండు నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర రైతులకు దాదాపు రూ. 19 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు ప్రకటించారు. మార్చి 21న లంగ్‌లై జిల్లా లంగ్‌సేన్‌ గ్రామంలో బయటపడిన ఈ వ్యాధి ప్రస్తుతం 9 జిల్లాలకు వ్యాపించింది. వీటి పరిధిలోని 91 గ్రామాలను స్వైన్‌ ఫీవర్‌ ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. ఇందులో ఒక్క ఆయ్‌జోల్‌ జిల్లాలోనే 55 గ్రామాలున్నాయి. స్వైన్ ఫీవర్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం 32 వేల పందులున్నాయి. అయితే ఈ వ్యాధి ప్రబలని ప్రాంతాల్లోనూ 100కు పైగా పందులు చనిపోయాయి. మిజోరంలో ఇలాంటి వ్యాధి ప్రబలడం ఇదే తొలిసారి. అయితే పందులను పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యాధితో మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదని, పందుల నుంచి ఇది మనుషులకు సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతుండటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.


By June 02, 2021 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/african-swine-fever-has-killed-4800-pigs-in-mizoram/articleshow/83163087.cms

No comments