Breaking News

కోవిడ్ బాధితులకు రూ.4 లక్షల చొప్పున పరిహారం వీలుకాదు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడ్‌విట్


కోవిడ్ బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించలేమని.. ఇది ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రతి బాధితుడికి రూ.4 లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాలు చెల్లించలేవని పేర్కొంది. కోవిడ్‌-19కు పరిహారం చెల్లించి, ఇతర వ్యాధులకు నిరాకరించడం ‘అన్యాయం’ అవుతుందని వివరించింది. ఈ మేరకు శనివారం రాత్రి సుప్రీంకోర్టులో కేంద్రం 183 పేజీల అఫిడ్‌విట్‌ను దాఖలు చేసింది. కోవిడ్ బాధితులకు పరిహారం విషయంలో వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించడంతో స్పందన తెలియజేసింది. ప్రాణాంతక కరోనా మహమ్మారికి 3.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ ఉందని తెలిపింది. కోవిడ్ కారణంగా రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నాయని, అందరికీ పరిహారం చెల్లించలేవని స్పష్టం చేసింది. కోవిడ్ బాధితులకు రూ.4 లక్షల పరిహారం చెల్లింపు, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుపై ఆదేశాలు జారీచేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రభుత్వ విధానాన్ని తెలియజేయాలని కోరింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలకు మాత్రమే పరిహారం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభించడం వల్ల పరిహారాన్ని కోవిడ్‌కు వర్తింపచేయడం సముచితం కాదని అభిప్రాయపడింది. వైద్య రంగానికి ఖర్చులు పెరగడం, పన్నుల ఆదాయం తగ్గిపోవడంతో పరిహారం చెల్లించే స్థితిలో రాష్ట్రాలు లేవని వివరించింది. ‘‘పరిహారం చెల్లింపునకు పరిమితి వనరులను ఉపయోగించడం, ఇతర అంశాలలో మహమ్మారి ప్రతిస్పందన, ఆరోగ్య వ్యయాన్ని ప్రభావితం చేయడం వల్ల దురదృష్టకర పరిణామాలకు దారితీయవచ్చు.. అందువల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది’’ అని అఫిడ్‌విట్‌లో పేర్కొంది. కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లిస్తే ఎస్డీఆర్ఎఫ్ నిధులన్నీ వారికే వస్తాయని, కోవిడ్‌పై పోరుకు నిధులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని తెలిపింది. ‘‘సుప్రీంకోర్టు అనేక తీర్పులను బట్టి ఇది అధికార యంత్రాంగం నిర్వహించాల్సిన విషయం.. దీనిని ఎవరికి అప్పగించడం కుదరదు.. పాలనా యంత్రాంగం తీసుకోవాల్సిన నిర్ణయాలను కోర్టు తన స్వంత తీర్పులకు ప్రత్యామ్నాయం చేస్తోంది’’ అని పేర్కొంది. అంతేకాదు, కోవిడ్ మరణాన్ని డెత్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేయాలని తెలిపింది. ఒకవేళ వైద్యులు ధ్రువీకరించడంలో విఫలమైతే శిక్షార్హులవుతారని వివరించింది. ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది.


By June 20, 2021 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cant-pay-rs-4-lakh-compensation-for-covid-victims-centre-tells-supreme-court/articleshow/83684158.cms

No comments