Breaking News

గవర్నర్‌తో సువేందు భేటీ: 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా.. బీజేపీకి బిగ్ షాక్ తప్పదా?


పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ఒక్కొక్కరుగా సొంతగూటికి చేరుకుంటున్నారు. తిరుగు వలసలను అడ్డుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. బెంగాల్ రాజకీయాల్లో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్‌తో ప్రతిపక్ష నేత భేటీకి ఓ వర్గం ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. సోమవారం సాయంత్రం గవర్నర్‌ జగదీప్ ధన్ఖర్‌ను కలవడానికి రాజ్‌భవన్‌కు సువేందు అధికారి బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చారు. అయితే, మొత్తం 74 మంది ఎమ్మెల్యేకుగానూ 24 మంది డుమ్మా కొట్టారు. దీంతో బెంగాల్‌లో తిరుగు వలసలపై ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాదు, ఈ ఎమ్మెల్యేలంతా సువేందు అధికారి నాయకత్వాన్ని అంగీకరించలేదని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న పలు హింసాత్మక ఘటనలు, ఇతర అంశాలపై గవర్నర్‌తో చర్చించేందుకు సువేందు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎన్నికల ముందు గతేడాది డిసెంబరులో నుంచి బీజేపీలోకి చేరిన సువేందు అధికారికి సీనియర్లను పక్కనబెట్టి అధిష్ఠానం ఆయనకు పెద్ద పీట వేసింది. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై గెలుపొందడంతో సువేందుకు బీజేపీ శాసనసభాపక్ష నేతగా పగ్గాలు అప్పగించింది. గత నెలలో యాస్ తుఫానుపై ప్రధాని నిర్వహించిన సమీక్షకు ఆయనను సైతం ఆహ్వానించారు. సువేందుకు అధికప్రాధాన్యత ఇచ్చి తమను పక్కనబెడుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో వీరంతా టీఎంసీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే సొంతగూటికి చేరిన ముకుల్ రాయ్‌ను అనుసరించనున్నట్టు సమాచారం. గతవారం ఆయన బీజేపీని వీడి టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. రాజీబ్ బెనర్జీ, దీపేందు బిశ్వాస్, శుభ్రాగ్షు రాయ్ కూడా అదే బాటలో ఉన్నారు. ముకుల్ వెంట బీజేపీలోకి వెళ్లిన టీఎంసీ నేతలు పార్టీలో చేరికను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. 30 మందికిపైగా బీజేపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టీఎంసీ నేతలు చెబుతున్నారు. ముకుల్ రాయ్ చేరక ముందు సోనాలీ గుహా, దుపేందు బిశ్వాస్ తదితరులు తిరిగి తాము టీఎంసీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. ఇక, బీజేపీ పైకి మాత్రం అంతా సక్రమంగానే ఉందని చెబుతున్నా.. కానీ, టీఎంసీలోకి వెళ్లే వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతామని సువేందు అంటున్నారు. తమను చేర్చుకోవాలని కోరుతూ బిర్భూమ్‌లో బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మమతకు క్షమాపణలు చెబుతూ ప్లకార్డులను ప్రదర్శించి, పార్టీలోకి చేర్చుకోవాలని కోరారు.


By June 15, 2021 at 07:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/missing-bjp-mlas-at-suvendu-adhikaris-meets-with-governor-sparks-migration-concern/articleshow/83530156.cms

No comments