Breaking News

పుణే: శానిటైజర్ పరిశ్రమంలో అగ్ని ప్రమాదం.. 18 మంది సజీవదహనం


మహారాష్ట్రలోని పుణేలో ఓ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. మరికొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. 20 మందికి పైగా కార్మికులను ఫైర్ సిబ్బం ది రక్షించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పుణే జిల్లాలోని ముల్షీ తాలుకాలోని పారిశ్రామిక వాడలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం 4 గంటల తర్వాత పరిశ్రమలోని ప్యాకేజింగ్ విభాగంలో తొలుత మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. ప్రమాదం జరిగిన కంపెనీలో శానిటైజర్లు, నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించే క్లోరిన్ డై ఆక్సైడ్‌ను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 40 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఇప్పటి వరకూ 20 మందిని రక్షించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ప్యాకేజీ విభాగంలో మంటలు చెలరేగడంతో చుట్టూ ప్లాస్టిక్ పదార్థాలే ఉండటం వల్ల వేగంగా వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు. మంటలు అదుపులోకి రాగా.. గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మహారాష్ట్రలోని పుణే రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం తీవ్ర విచారకరం.. కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం.. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మోదీ ట్వీట్ చేశారు.


By June 08, 2021 at 06:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/18-dead-in-fire-accident-pune-sanitiser-factor-rescuers-search-for-missing-staff/articleshow/83327315.cms

No comments