Breaking News

చిచ్చురేపిన Yaas Cyclone.. మమతాకు ఝలక్ ఇచ్చిన మోదీ!


యాస్ తుఫాను పుణ్యమా అని మరోసారి కేంద్ర ప్రభుత్వం, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యింది. బెంగాల్‌లో శుక్రవారం ఏరియల్ సర్వే అనంతరం మోదీ సమీక్ష సమావేశం నిర్వహించగా.. ఈ భేటీకి సీఎం 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. వచ్చిన ఓ 15 నిమిషాల తర్వాత మోదీకి ఓ నివేదికను అప్పగించిన దీదీ.. తన ముఖ్య కార్యదర్శితో సహా తిరిగి వెళ్లిపోయారు. దీనిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానితో సమావేశానికి కేవలం బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. సీఎస్ అలాపన్ బందోపాధ్యాయను వెనక్కు రావాలంటూ ఆదేశాలు జారీచేసింది. నాలుగు రోజుల కిందటే అలాపన్ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించడం గమనార్హం. మే 31లోగా ఐఏఎస్ అధికారి అలాపన్ బందోపాధ్యాయను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి పంపాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం చర్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) విమర్శలు గుప్పించింది. ఓ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బలవంతంగా కేంద్ర సర్వీసులకు తీసుకోవడం స్వాతంత్ర భారత చరిత్రలోనే జరగలేదని దుయ్యబట్టింది. బెంగాల్ ప్రజలను అవమానించేలా మోదీ-షాల బీజేపీ ద్యయం దిగజారిపోవడంతోనే మమతా బెనర్జీని అధిక మెజార్టీతో ఎన్నుకున్నారని టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు. అయితే, బెంగాల్‌లో ఉన్నతాధికారులను కేంద్రం వెనక్కు రప్పించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులను వెనక్కు రప్పించింది. కేంద్ర హోం శాఖ ఐపీఎస్ అధికారుల నియంత్రణ విభాగం కాగా.. ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ) బెంగాల్ సీఎస్‌ను వెనక్కు రావాలని ఆదేశించింది. ఐఏఎస్ (క్యాడర్) నిబంధనల్లోని సెక్షన్ 6(1) ప్రకారం బెంగాల్ సీఎస్‌ను కేంద్రం వెనక్కు పిలిచింది.


By May 29, 2021 at 07:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-recalls-bengal-chief-secretary-after-pm-modi-mamata-banerjee-meet-row/articleshow/83054749.cms

No comments