Breaking News

Vaccine కొనుగోళ్లను కేంద్రం ఆలస్యం చేసింది.. టాప్ వైరాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు


దేశంలో వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ విషయంలో కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ సభ్యుడు, ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిగతా దేశాలతో పోల్చితే పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ల కొనుగోలు ప్రక్రియను భారత్ ఆలస్యం చేసిందని ఆమె అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో అవకాశాలు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘మిగతా ప్రపంచం ఒక ఏడాదికి సరిపడే వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తోంది.. కాబట్టి మనం ఇప్పుడు వెళ్లి కొనాలనుకుంటున్నట్టు చెబితే మార్కెట్లో టీకాలు ఏమేరకు అందుబాటులో ఉంటాయి?’’ అని అన్నారు. మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ల సరఫరాకు గ్లోబల్ టెండర్లకు సిద్ధమైన వేళ డాక్టర్ కాంగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మూడో దశ వ్యాప్తి ముప్పు పొంచి ఉందన్న నిపుణులు హెచ్చరికలతో పలు రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్ల కొరతతో పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇప్పటికే మూతపడ్డాయి. ‘‘ఒకవేళ జైడస్ కాడిలా, బయోలాజికల్ ఇ సంస్థలు ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్లు సిద్ధమైతే.. మీకు వీలైనంతగా ఎక్కువ టీకాలు ఉత్పత్తి చేసి మీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ప్రతిదాన్ని మేము తీసుకుంటామని వారికి చెప్పాలి.. దీని వల్ల ఎక్కువ డోస్‌లు అందుబాటులోకి వస్తాయి’’ అని ఆమె అన్నారు. వ్యాక్సిన్‌ను పూర్తిగా అభివృద్ధి చేయలేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘మనం తప్పక ఆ రిస్క్ తీసుకోవాలి.. అలా చేస్తే అది భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుంది.. ఎందుకంటే ఆవిష్కరణలు ఎల్లప్పుడూ విజయవంతం కావని తెలుసుకుని, వాటిపై పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు’’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రం చేస్తున్న ఖర్చుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా టీకా కోసం గతేడాది మార్చిలోనే 10 బిలియన్ డాలర్లు కేటాయించింది. కానీ, భారత్ మాత్రం వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఒక్క పైసా కూడా విదల్చలేదు. అలాగే, ఏక మొత్తంలో వ్యాక్సిన్లు కొనుగులు చేయలేదు. అంతేకాదు, గతేడాది నవంబరు చివరి నాటికే అమెరికా, ఐరోపా సమాఖ్యలు 700 మిలియన్ డోస్‌ల చొప్పున టీకాలకు ముందస్తు ఆర్డర్లు చేశాయి. భారత్‌లో అప్పటికి ఇంకా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభించగా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 11 మిలియన్ డోస్‌లు, భారత్ బయోటెక్ 5.5 మిలియన్ డోస్‌లు తొలి దశలో సరఫరా చేశాయి.


By May 24, 2021 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-late-to-the-table-in-buying-vaccines-top-virologist-gagandeep-kang/articleshow/82898666.cms

No comments