Breaking News

Sanfrancisco shooting రైలు యార్డులో సహోద్యోగి నరమేధం.. 8 మంది మృతి


అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడి.. ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరం సమీపంలోని లైట్‌ రెయిల్‌ యార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఉద్యోగే సహచరులపై కాల్పులకు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందారు. శాన్ జోస్‌లోని శాంటా క్లారా లోకల్ వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యార్డులో దుండగుడు బుధవారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మృతి చెందినవారిలో నిందితుడు కూడా ఉన్నారు. మృతులంతా ట్రాన్స్‌పోర్టేషన్‌ సంస్థకు చెందిన ఉద్యోగులేనని అధికారులు తెలిపారు. ఉద్యోగుల సమావేశం జరుగుతుండగా దుండగుడు కాల్పులకు పాల్పడినట్టు ఓ బాధితుడి తల్లి చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. రైలు యార్డులో పేలుడు పదార్థాలు కూడా ఉన్నట్టు సమాచారం అందడంతో బాంబు స్క్యాడ్‌తో తనిఖీలు చేపట్టినట్టు శాంటా క్లారా కౌంటీ అధికారి రస్సెల్ డేవిస్ తెలిపారు. ఘటనలో ఎనిమిది మంది చనిపోయారని, వీరిలో నిందితుడు కూడా ఉన్నారని అన్నారు. బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన గురించి 911 కాల్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడా? తనను తాను కాల్చుకున్నాడా? ఎటువంటి ఆయుధం వినియోగించడనేది? తెలియదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ కైరినే జీన్-పియరీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో బాధితులు, వారి కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. కోవిడ్ మహమ్మారితో సతమతమవుతున్న తరుణంలో తుపాకుల హింస చోటుచేసుకోవడంపై అధ్యక్షుడు తీవ్రంగా పరిగణిస్తున్నారని అన్నారు. తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన బైడెన్.. గన్‌ వయలన్స్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎపడిమిక్‌’ పేరుతో గత నెలలో బైడెన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఫెడరల్‌ ఏజెంట్, తుపాకుల నియంత్రణ వ్యవస్థకి సలహాదారుడైన డేవిడ్‌ చిప్‌మ్యాన్‌ను బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్,ఎక్స్‌ప్లోజివ్స్‌కు (ఏటీఎఫ్‌)కు డైరెక్టర్‌గా నియమించారు. పూర్తి స్థాయిలో నియంత్రించాలంటే బైడెన్‌ చేపట్టిన చర్యలన్నీ చట్టంగా మారాల్సి ఉంది. దీనికి కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.


By May 27, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/eight-killed-by-employee-in-california-rail-yard-mass-shooting/articleshow/82994095.cms

No comments