Breaking News

PNB Scam వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అంటిగ్వాలో మిస్సింగ్!


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం చోక్సీ అదృశ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ ఆదృశ్యమైనట్లు ఆయన తరఫు లాయర్ విజయ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. చోక్సీ అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అంటిగ్వాలోని ప్రముఖ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ సోమవారం సాయంత్రం వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అంటిగ్వా పోలీసులు.. చోక్సీ గురించి గాలిస్తున్నారు. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్‌ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీ 2017లో అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. అయితే, 2018లో పీఎన్‌బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీ దేశం విడిచి పరారయ్యాడు. నీరవ్‌ మోదీకి మెహుల్‌ చోక్సీ మేనమామ అవుతారు. నీరవ్ ప్రస్తుతం బ్రిటన్‌ జైల్లో ఉన్న విషయం విదితమే. గీతాంజలి జ్యువెలర్ గ్రూప్ అధినేత అయిన మెహుల్ చోక్సీ కోసం సీబీఐ, ఈడీలు గాలిస్తున్నాయి. మొత్తం రూ.13,578 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో చోక్సీ రూ.7,080 కోట్లు మేర అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి నెల రోజుల ముందే 2018 జనవరి 4 అంటిగ్వాకు చెక్కేశారు. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ కాగా.. 2013లో స్టాక్ మార్కెట్ మోసం కేసులోనూ ఆరోపణలు ఉన్నాయి. చోక్సీ కేవలం భారతీయ బ్యాంకులనే కాదు, దుబాయ్, అమెరికాలకు చెందిన వ్యాపారులు, కస్టమర్లను మోసం చేసినట్టు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అతడికి చెందిన రూ.2,500 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. అయితే, అంటిగ్వా-బార్బుడా ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో మెహుల్ చోక్సీ పౌరసత్వాన్ని రద్దుచేసింది. దీనిని ఆయన కోర్టులో సవాల్ చేశారు.


By May 25, 2021 at 07:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/diamond-merchan-mehul-choksi-goes-missing-in-antigua-who-accused-in-pnb-scam/articleshow/82928680.cms

No comments