Breaking News

PM Care కరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం అద్భుత పథకం.. రూ.10 లక్షల నగదు!


కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విలయం సృష్టిస్తోంది. రోజూ లక్షల కేసులు నమోదవుతుంటే, వేలాది మరణాలు చోటుచేసుకుంటున్నాయి. మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపి, ఎంతో మందిని అనాథలను చేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. భర్తలను కోల్పోయిన భార్యలు.. ఇలా ఎన్నో విషాద గాథలు. గతేడాది నుంచి వేలాది కుటుంబాలు వీధినపడ్డాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకోడానికి కేంద్రం ముందుకొచ్చింది. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం ‘ ఫర్ చిల్డ్రన్స్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా కరోనాతో అనాథలైన పిల్లల పేరిట నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. ఉచిత విద్యను అందజేస్తారు. కేంద్రీయ, నవోదయ, సైనిక లేదా ప్రయివేట్ విద్యాలయాల్లో వీరికి చదువు చెప్పిస్తారు. దీనికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత నెల నెలా స్టయిపెండ్ అందిస్తారు. డిపాజిట్ చేసిన నగదును 23 ఏళ్లు నిండిన తర్వాత రూ. 10 లక్షలు ఇస్తారు. ఈ నగదును వ్యాపారం లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించవచ్చు. అంతేకాదు ఉన్నత చదువుల కోసం రుణాలను ఇప్పించి.. వీటికి వడ్డీని పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాత్ భారత్ స్కీమ్ కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పిస్తారు. దానికి పీఎం-కేర్స్ నుంచే ప్రీమియం చెల్లిస్తారు. ‘‘'పిల్లలు దేశ భవిష్యత్తు. వారికి అవసరమైన భద్రత, సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని ఈ పథకం ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. పదేళ్లలోపు అనాథలైన చిన్నారులను సమీపంలోని కేంద్రీయ లేదా ప్రయివేట్ విద్యాలయాల్లో డే స్కాలర్‌గా చేర్పిస్తారు. ఒకవేళ ప్రయివేట్ పాఠశాలలో చేరితే విద్యాహక్కు చట్టం కింద పీఎం కేర్స్ నుంచి ఫీజులు చెల్లిస్తారు. యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ అన్ని ఖర్చులను భరిస్తారు. ఇక, 11 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులను సైనిక, నవోదయ పాఠశాలల్లో చేర్చుతారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన పిల్లలు దేశవ్యాప్తంగా 577 మంది ఉన్నట్టు గతవారం కేంద్ర మహిళ శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి మే 25 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నివేదికల ఆధారంగా ఈ సంఖ్యను ఆమె వెల్లడించారు. అనాథల కోసం పథకాన్ని ప్రకటించిన ప్రధానికి స్మృతి ఇరానీ ధన్యవాదాలు తెలిపారు.


By May 30, 2021 at 06:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-cares-to-pay-for-education-care-of-children-orphaned-by-covid-19/articleshow/83079531.cms

No comments