Breaking News

Happy Birthday Ram: చాక్లెట్ బాయ్ టు ఇస్మార్ట్ హీరో.. రామ్ పోతినేని సినీ ప్రస్థానం ఇదే


ఒకప్పుడు ఆయన ఓ చాక్లెట్ బాయ్.. రొమాంటిక్, క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కానీ, గత కొంతకాలంగా ఇస్మార్ట్ శంకర్‌గా, ఉస్తాద్‌గా పేరు సంపాదించుకున్నారు. అతనే హీరో . 2006లో తన సినీ కెరీర్ ప్రారంభించిన రామ్.. విజయవంతంగా తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 15 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు ఆయన. హీరో రామ్ శనివారం (మే 15)న తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని సినిమా కెరీర్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రామ్ పోతినేని మే 15, 1988న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. ప్రముఖ సినీ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఆయనకు మేనమామ. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో రామ్ తన యాక్టింగ్ కెరీర్‌ని ప్రారంభించారు. ఈ షార్ట్ ఫిలిమ్‌లో రామ్ డ్రగ్స్‌కి బానిస అయిన ఓ కుర్రాడిగా నటించారు. ఆ తర్వాత వై.వీ.ఎస్.చౌదరీ డైరెక్షన్‌లో 2006లో రూపొందిన ‘దేవదాసు’ సినిమాతో అతను వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ నటించిన ‘రెడీ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి. అయితే రామ్ మాత్రం తన పట్టు వదలలేదు. విలక్షణమైన నటనతో అతను ప్రేక్షకులను మెప్పు పొందుతూనే వచ్చారు. ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది. అప్పటివరకూ చాక్లెట్‌ బాయ్‌లా ఉన్న రామ్‌ను ఈ సినిమాలో పక్కా మాస్ హైదరాబాదీ రౌడీగా పూరీ చూపించారు. ఈ సినిమాతో రామ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. దీని తర్వాత రామ్ లేటెస్ట్‌గా ‘రెడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అతను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా అతని కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ.. తెలుగు సమయం తరఫున రామ్ పోతినేనికి హ్యాపి బర్త్‌డే విషెస్.


By May 15, 2021 at 09:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/special-story-about-hero-ram-cinema-carrer/articleshow/82650947.cms

No comments