Breaking News

కేంద్రంపై విమర్శలు.. కోవిడ్ ప్యానెల్ నుంచి తప్పుకున్న టాప్ వైరాలజిస్ట్!


కోవిడ్ టాస్క్‌ఫోర్స్ శాస్త్రీయ సలహా బృందం నుంచి అనూహ్యంగా సీనియర్ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తప్పుకున్నారు. కోవిడ్ రెండో దశ వ్యాప్తి విషయంలో అధికార యంత్రాంగం తీరును జమీల్ తప్పుబట్టిన కొద్ది రోజుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ అంశంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రెటరీ రేణూ స్వరూప్ స్పందించడానికి నిరాకరించారు. ‘‘తాను మంచి నిర్ణయమే తీసుకున్నా.. దీనిపై ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు’’ అని డాక్టర్ షాహీద్ వ్యాఖ్యానించారు. ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ)లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ‘‘రాజీనామాపై ఎటువంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని రాయిటర్స్‌కు సమాధానం ఇచ్చారు. కాగా, ‘‘భారత్‌లోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారిత విధానపరమైన రూపకల్పనకు బదులు మొండి వైఖరితో కూడిన ప్రతిస్పందనను ఎదుర్కొంటున్నారు’’ ఇటీవల డాక్టర్ జమీల్ న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన వ్యాసంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కోవిడ్ నిర్వహణ ముఖ్యంగా తక్కువ సంఖ్యలో టెస్టింగ్, మందకొడిగా వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ కొరత వంటివి ఉన్నాయని అన్నారు. ‘‘ఈ చర్యలన్నింటికీ భారతదేశంలోని నా తోటి శాస్త్రవేత్తలలో విస్తృత మద్దతు ఉంది.. కానీ వారు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి పట్టుదలను ఎదుర్కొంటున్నారు’’ అంటూ పరోక్షంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సమాచార సేకరణలో అంతరరం ఉండకూడదని అన్నారు. ‘‘ఇదే అంశంపై ప్రధాన మంత్రికి ఏప్రిల్ 30న 800 మంది భారతీయ శాస్త్రవేత్తలు విజ్ఞ‌ప్తి చేస్తూ.. ఈ సమాచారం వల్ల తదుపరి అధ్యయనంతోపాటు మహమ్మారిని అంచనావేసి, కట్టడి చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు’’ అని పేర్కొన్నారు. ‘‘భారత్‌లో మహమ్మారి నియంత్రణలో లేనందున డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మరో ప్రమాదమే... చెల్లించుకుంటున్న మూల్యం శాశ్వత మచ్చగా మిగిలిపోతుంది’’ అని అన్నారు. కొత్తరకం, అనేక కరోనా వేరియంట్లు దేశంలో వ్యాప్తి చెందే అవకాశం ఉందని మార్చి తొలినాళ్లలోనే ప్రభుత్వ అధికారులను ఐఎన్ఎస్ఏసీఓజీ హెచ్చరించినట్టు ఇటీవల రాయిటర్స్‌తో డాక్టర్ జమీల్ అన్నారు.. ఈ హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు.. ఈ విషయాలపై ప్రభుత్వం ఎందుకు మరింత బలంగా స్పందించలేదని అడిగిన ప్రశ్నకు జమీల్ స్పందిస్తూ.. వారు విధానపరమైన నిర్ణేతలు కావడంతో సాక్ష్యాలపై అధికారులు తగినంత శ్రద్ధ చూపలేదని సమాధానం ఇచ్చారు.


By May 17, 2021 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/senior-virologist-shahid-jameel-quits-covid-panel-after-criticising-government/articleshow/82698418.cms

No comments