Breaking News

తమిళనాట డీఎంకే దూకుడు.. వన్‌సైడ్‌ వార్‌గా మార్చేసిన స్టాలిన్


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేతృత్యంలోని ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ అధికార పీఠాన్ని అధిష్టించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన 117 స్థానాలు దాటేసిన డీఎంకే ప్రస్తుతం 140కి పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంగా కొనసాగుతోంది. ఆ పార్టీ అధినేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్‌ సైతం కలత్తూరులో విజయం దిశగా దూసుకుపోతున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు ముందునుంచే అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పోలింగ్ రోజు సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సైతం స్టాలిన్‌వైపు మొగ్గుచూపాయి. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ కొలువుదీరడం ఖాయమైన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. స్టాలిన్‌ సోదరి కనిమొళి సహా పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తున్నామన్న సంతోషంలో డీఎంకే కార్యకర్తలు సంబంరాలు చేసుకున్నారు. కరుణానిధి హయాంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్.. తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతుండటం విశేషం. తమిళనాడులో ఎన్నికలంటే గతంలో కరుణానిధి వర్సెస్ జయలలితగా భావించి దేశం మొత్తం ఆసక్తి కనబరిచేది. అయితే ఆ దిగ్గజ నేతలు కన్నుమూయడంతో దశాబ్దాల తర్వాత వారిద్దరు లేకుండా జరుగుతున్న ఈ ఎన్నికలపైనా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తండ్రి మరణం తర్వాత పూర్తిస్థాయిలో డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌ అధికార అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని ఎలా ఢీకొడతారన్న అంశం ప్రజల్లో ఆసక్తిని పెంచింది. సోదరుడు అళగిరితో విభేదాల నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఆయన సొంతపార్టీ పెడితే ఎలా ఢీకొంటారన్న విషయాలపై విస్తృత చర్చ జరిగింది. దీంతో ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయిన స్టాలిన్‌, తండ్రిని గుర్తుచేస్తూనే తమకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామన్న అంశాలపై ప్రసంగాలు చేసి ప్రజలను ఆకట్టుకున్నారు.


By May 02, 2021 at 02:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-election-results-2021-dmk-leading/articleshow/82354603.cms

No comments