కాలు బయటపెడితే జేబుకు చిల్లే... చెన్నై కార్పోరేషన్ అనూహ్య నిర్ణయం

దేశం మొత్తం కరోనాతో బాధపడుతోంది. దీంతో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. అయితే ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వాలను కలవరపరుస్తోంది. దీంతో ఒక్కో రాష్టం ఒక్కో తరహాలో కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే రూ.2వేలు జరిమానా విధించాలని గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. హోం క్వారంటైన్ లో ఉండాల్సిన కోవిడ్ బాధితులు నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే వారికి రూ.2వేల వరకు జరిమానా విధిస్తామని, తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని కరోనా కేర్ సెంటర్‌కు తరలిస్తామని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు బయట సంచరిస్తే 044-25384520 నెంబరుకు ఫిర్యాదు చేయాలని అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో మంగళవారం ఒక్కరోజే 33,059 కరోనా కేసులు నమోదు కాగా... 21,262 మంది కోవిడ్ నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సుమారు వారం పదిరోజులుగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నా కేసులు పెరుగుతుండటం సర్కారును ఆందోళనకు గురిచేస్తోంది.
By May 19, 2021 at 11:19AM
No comments