Breaking News

ఎన్నికల కమిషన్‌లో విబేధాలపై సీఈసీ సుశీల్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు


దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తికి ఎన్నికల కమిషన్ చర్యలే కారణమని వస్తున్న విమర్శలపై సీఈసీ తోసిపుచ్చారు. ఏప్రిల్ 13న సీఈసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈసీ రాజీవ్ కుమార్‌తో ఉన్న విబేధాలపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. అంతేకాదు, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బెంగాల్‌లోని చివరి రెండు దశల పోలింగ్‌ను కలిపి ఒకేసారి నిర్వహించాలన్న అభ్యర్థనలపై కూడా సుశీల్ చంద్ర వివరణ ఇచ్చారు. ఏ సమయంలోనైనా ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన చేయలేదని, చివరి రెండు దశల పోలింగ్ ఒకేసారి నిర్వహిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి చర్చించామని వివరించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే రంజాన్, హోలీ వంటి పండుగలు, సెలవు దినాలను పరిగణనలోకి తీసుకున్నామని సీఈసీ పేర్కొన్నారు. ‘‘మద్రాస్ హైకోర్టు ‘హత్యానేరం’ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకుంటే ఈసీకి సంబంధం లేకుండా ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యక్తిగతంగా అఫిడ్‌విట్ దాఖలు చేయడానికి ప్రయత్నించింది వాస్తవే.. తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌‌కు ఇద్దరు కమిషనర్లూ ఏకాభ్రిపాయం వ్యక్తం చేశారు’’ అన్నారు. వాస్తవానికి, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఈసీ సభ్యులు ఇద్దరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇప్పుడు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు వ్యాఖ్యలు కఠినమైనవి, తగనివి అని కోర్టు స్పష్టం చేసింది. ఇది మహమ్మారి వ్యాప్తి కారణాలను ఈసీకి ఆపాదించలేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా మూగిశాయని తెలిపారు. పశ్చిమ్ బెంగాల్‌లో 82.2 శాతం, అసోంలో 82.3 శాతం, పుదుచ్చేరిలో 83.4 శాతం, కేరళలో 74.5 శాతం, తమిళనాడులో 73.6 శాతం ఓటింగ్ నమోదయ్యిందన్నారు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 18.6 కోట్ల మంది ఓటర్లు 2.7 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 13.6 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయని, 2016లో ఇవి 2.97 లక్షలు మాత్రమేనని తెలిపారు. 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు, కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని వివరించారు. బెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించడంపై వచ్చిన విమర్శలను తోసిపుచ్చారు. గతంలోనూ ఆ రాష్ట్రంలో వివిధ దశల్లో ఎన్నికలు జరిగాయని అన్నారు. కరోనా రెండో దశ వ్యాప్తిపై ఆరోగ్య అధికారులు, నిపుణులు ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదని అన్నారు. ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్న సమయంలోనే కోవిడ్ పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరడంతో నిబంధనలను సవరించామని సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఎప్పుడూ ఆలోచించలేదని వివరించారు.


By May 10, 2021 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/never-thought-of-deferring-assembly-polls-due-to-covid-surge-cec-sushil-chandra/articleshow/82515702.cms

No comments