Breaking News

బెంగాల్: ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా..!


పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 77 మంది ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 75కి పడిపోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు లోక్‌సభ సభ్యులు కావడంతో ఏదో ఒక పదవిని వదులుకోవాలి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్న బీజేపీ అధిష్ఠానం సూచనలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం అందజేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 రోజుల్లోనే పదవులకు రాజీనామా చేయడంతో అధికార తృణమూల్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. లోక్‌సభలో తన బలం తగ్గిపోతుందనే భయంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని టీఎంసీ ఎద్దేవా చేసింది. అంతేకాదు, కేంద్ర బలగాలతో బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎంపీలు బీజేపీ నుంచి పోటీచేశారు. అయితే, వీరిలో నిషిత్ ప్రమాణిక్, జగన్నాథ్ సర్కారులు మాత్రమే గెలుపొందారు. బెంగాల్‌ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటుచేస్తామనే ఆశతో ఎంపీలకు బీజేపీ అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చింది. కానీ, ఎత్తుల ముందు బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. దీంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరి ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటే ఉపయోగం ఉంటుందని కాషాయ పార్టీ భావించింది. ‘‘బెంగాల్‌లో ఈ ఫలితం ఊహించలేదు.. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే కీలక పాత్ర పోషించేవాళ్లం.. ప్రస్తుతం అది సాధ్యకాదు కాబట్టి ఎంపీలుగా ఉండాలని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని పార్టీ ఆదేశించింది.. అందుకే రాజీనామా చేశాం’’ అని రణఘాట్ ఎంపీ జగన్నాథ్ సర్కారు వెల్లడించారు. జగన్నాథ్ సర్కార్ శాంతిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రమాణిక్, సర్కార్‌లకు కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తుండగా.. అసెంబ్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న సువేందు అధికారికి జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. బెంగాల్‌లోని మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతోనే భద్రత కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీరి భద్రత కోసం నెలకు కోటిన్నర రూపాయలు చొప్పున బిల్లులు చెల్లించనున్నట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది. ‘‘రెండేళ్లుగా బీజేపీలో ఉంటున్నా ఎటువంటి సమస్య లేదు.. కానీ, మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. మాకు భద్రత అవసరం.. ప్రాణాలకు ముప్పు ఏర్పడింది.. ప్రజలు తమను ఎన్నుకున్నా కానీ, భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.. కేంద్రం భద్రత కల్పిస్తోంది’’ అని అసన్‌సోల్ దక్షిణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్ అన్నారు. ఇక, బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై టీఎంసీ విమర్శలు గుప్పించింది. ‘‘ఓటేసి తొలుత పార్లమెంట్‌కు, తర్వాత అసెంబ్లీకి పంపిన ప్రజలను ఘోరంగా అవమానించారు.. రెండోది, బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించడం.. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే’’ అని టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ అన్నారు.


By May 13, 2021 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-bjp-mps-resign-in-west-bengal-who-contested-and-won-in-assembly-election/articleshow/82596143.cms

No comments