Breaking News

శవాలతో ఉప్పొంగుతున్న గంగ.. వందేళ్ల కిందట దుస్థితి పునరావృతం


రెండు రోజులుగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌ గంగా పరివాహక ప్రాంతాల్లో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో గంగా నది ఒడ్డున రెండు చోట్ల పలు మృతదేహాలు బయటపడ్డాయి. ఇసుకలో ఖననం చేసిన మృతదేహాలు పెద్ద సంఖ్యలో బయటపడిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మృతదేహాల్లో చాలా వాటిపై కాషాయ వస్త్రం కప్పి ఉన్నవే కావడం గమనార్హం. ఈ ప్రాంతం ఉన్నావ్ సహా మూడు జిల్లాలకు అంత్యక్రియలు నిర్వహించే ప్రధాన ప్రదేశమని, ఈ మృతదేహాలు కోవిడ్ రోగులవని నిర్ధారించలేదని ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ‘‘కొంత మంది మృతదేహాలను దహనం చేయకుండా నది ఒడ్డున ఇసుకలో ఖననం చేస్తున్నారు.. ఉన్నావ్‌లో మృతదేహాలు బయటపడిన విషయం గురించి తెలిసి అక్కడకు అధికారులను పంపాం.. దీనిపై వారు విచారణ జరిపించి నివేదిక అందజేస్తే చర్యలు తీసుకుంటాం’’ అన ఉన్నావ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం బిహార్‌లోని బక్సర్‌ జిల్లా చౌసా బ్లాక్‌లో మహాదేవ్ ఘాట్ వద్ద తొలిసారి 100కి పైగా మృతదేహాలను గుర్తించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో ఆ మృతదేహాలను జంతువులు పీక్కు తింటున్నట్లు ఫొటోలలో కనిపించింది. ఇవి తమ రాష్ట్రానివి కావని బిహార్ అధికారులు చెబుతున్నారు. ఈ మృతదేహాలు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కొట్టుకొచ్చాయని అంటున్నారు. ఆ తర్వాతి రోజు యూపీలోని ఘాజీపూర్ వద్ద మృతదేహాలు గుర్తించడంతో దీనిపై విచారణ జరుపుతున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైనది గంగానది.. అయితే, ఇందులో మృతదేహాలను పడేయడం హిందూమతం సహా ఇతర మత సంప్రదాయం కాదు. అయితే, కరోనా కారణంగా శవాలను కాల్చడానికి స్థలం, కట్టెలు దొరకడం లేదని, అందుకే నదిలో వదిలేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయడంలేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఇవన్నీ కోవిడ్ అధికారిక మరణాల్లో చూపని మృతదేహాలుగా భావిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలోకి ప్రవేశించిన స్పానిష్ ఫ్లూ విలయమే సృష్టించింది. ఆ ఇన్‌ఫ్లూయేంజా కారణంగా దాదాపు 1.8 కోట్ల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య కన్నా ఇది అధికం. భారతప్రజల్లో ఆరు శాతం మంది చనిపోయారు. అప్పట్లో స్పానిష్ ఫ్లూ మరణాలతో శవాలు కుప్పలుగా పేరుకుపోయాయి. వాటిని దహనం చేయటానికి సరిపడేంతగా కట్టెలు లేవు. దీంతో గంగ శవాలతోనే నిండిపోయింది. ప్రస్తుతం కూడా దేశంలో అదే పరిస్థితి పునరావృతమవుతున్నాయి నిపుణులు ఆందోళన చెందుతున్నారు.


By May 13, 2021 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dead-bodies-found-buried-in-sand-on-banks-of-ganga-in-unnao-in-up/articleshow/82597244.cms

No comments