Breaking News

భారత ప్రభుత్వం కొత్త రూల్స్‌ను పాటిస్తాం.. ఫేస్‌బుక్, గూగుల్ ప్రకటన


కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఐటీ మార్గదర్శకాలను పాటించడానికి సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్‌, గూగుల్‌లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ నిబంధనలు అమలు దిశగా తమ కసరత్తు ఆరంభించామని పేర్కొన్నాయి. కేంద్రంతో తరచూ వివాదాలను ఎదుర్కొంటున్న ట్విటర్‌ మాత్రం ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయకపోవడం గమనార్హం. ఈ నిబంధనల అమలును ఏడాదిపాటు వాయిదా వేయాలని దేశీయ, అంతర్జాతీయ సంస్థలు కోరినా కేంద్రం మాత్రం స్పందించలేదు. బుధవారం (మే 26) నుంచి కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేయడమే తమ లక్ష్యమని ఫేస్‌బుక్‌ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఐటీ మార్గదర్శకాలు అమలు ప్రక్రియపై కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ‘‘మార్గదర్శకాలను అమలు చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. మా సామర్థ్యాలను మెరుగు పర్చుకుంటాం. అయితే... కొన్ని అంశాలపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాం. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ భావాలు వ్యక్తంజేసుకునే వేదికగా నిలిచేందుకు మేం కట్టుబడి ఉంటాం’’ అని ఫేస్‌బుక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ప్రభుత్వ నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలు గురించి ఫేస్‌బుక్‌ వివరించలేదు. అటు, గూగుల్‌ కూడా ఈ నిబంధనలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సంస్థ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం.. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి... ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ.. వనరులను, సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తున్నాం’’ అని తెలిపింది. కాగా, ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘కూ’ గతవారమే తాము భారత ప్రభుత్వం విధించిన నిబంధనలన్నీ పాటించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ‘కూ’కు 60 లక్షల మంది వినియోగదారులున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియా, ఓటీటీ వేదికల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలు వెలువరించింది. అప్పటి నుంచే ఇవి అమల్లోకి వచ్చినా ట్విట్టర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, కూ వంటి దిగ్గజ సంస్థలకు మూడు నెలల సమయం ఇవ్వగా.. గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో ఈ సంస్థలన్నీ కొత్త నిబంధనలను తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాటికి రక్షణ కవచంగా ఉన్న ‘మధ్యవర్తి హోదా’ రద్దవుతుంది. ఫేస్‌బుక్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన పోస్ట్ పెడితే వారిపై క్రిమినల్‌ లేదా ఇతరత్రా చర్యలకు ఆస్కారం ఉండేది. ఫేస్‌బుక్‌కు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ, కొత్త నిబంధనల్లో ఆ వెసులుబాటు తొలగించారు. క్రిమినల్‌ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది.


By May 26, 2021 at 10:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/facebook-google-working-on-complying-with-centre-new-it-guidelines-as-deadline-looms/articleshow/82965203.cms

No comments