Breaking News

‘‘మద్రాస్ హైకోర్టు అవమానకర వ్యాఖ్యలు చేసింది’’ సుప్రీంలో ఈసీ ఫిర్యాదు


దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తికి ఎన్నికల కమిషన్‌ను బాధ్యులను చేస్తూ హత్య కేసు నమోదుచేయాలన్న వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు ఈసీ ఫిర్యాదు చేసింది. మద్రాస్ హైకోర్టు ఘోరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిందని ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమిళనాడులో కోవిడ్ వ్యాప్తికి కారణమైందని హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాదు, కౌంటింగ్ ప్రక్రియ మరో వ్యాప్తికి కారణం కాకూడదని హెచ్చరించింది. ‘‘మద్రాస్ హైకోర్టు నిర్లక్ష్యంగా, అవమానకరమైన వ్యాఖ్యలు చేసింది’’ అని శనివారం దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘‘రాజ్యాంగ అధికారం ఉన్న వ్యవస్థ మరో స్వతంత్ర రాజ్యాంగ అధికారంపై ఎటువంటి ఆధారాల్లేకుండా హత్యారోపణలు చేసింది. ఇవి చివరికి రెండు సంస్థలకూ ప్రమాదకరమని’’ పేర్కొంది. ఎన్నికల కమిషన్ దాఖలుచేసిన ఈ పిల్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సోమవారం విచారించనుంది. కోవిడ్ సంబంధిత అంశంపై శుక్రవారం నాటి విచారణలో హైకోర్టులకు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. సున్నితమైన అంశాలలో తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. కౌంటింగ్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఎన్నికల కమిషన్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనల కచ్చితంగా అమలు చేయాలని, విజయోత్సవాలను నిర్వహించరాదని ఈసీ ఆదేశాలు జారీచేసింది. గెలిచిన అభ్యర్థి వెంట ఇద్దరు మాత్రమే వెళ్లాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో సౌకర్యాలు తదితన కోవిడ్ సంబంధిత అంశాలపై పలు హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, అలహాబాద్, తెలంగాణ, గుజరాత్ హైకోర్టు‌లు ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలకు తలంటుతున్నాయి. కేంద్రం వైఖరిపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రజలు చనిపోతుంటే పరిశ్రమలే ముఖ్యమా? అని నిలదీసింది. రెమ్‌డెసివిర్ నిబంధనలపై కూడా అసహనం వ్యక్తం చేసింది.


By May 02, 2021 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/election-commission-goes-to-supreme-court-over-madras-high-court-murder-remarks/articleshow/82350163.cms

No comments