Breaking News

మే డే.. శ్రామికుల జీవితాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన శుభదినం


మే 1.. అంటే ‘మే డే’..అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. కానీ అమెరికాలో మాత్రం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తారు. పలు దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం, సంఘటనకో పరిమితం కాదు. శ్రమదోపిడిని నిరసిస్తూ..యావత్ ప్రపంచ కార్మికుల్లో స్పూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘మేడే’.19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా, యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. ఆ పరిశ్రమలలో గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేకుండా రోజుకు 16-18 గంటలు కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకునేవారు. దీనిని నిరసిస్తూ 1886 మేలో చికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు బీజం వేసింది. తొలిసారిగా 1884లో రోజుకి 8 గంటలు మాత్రమే పని ఉండాలని కార్మికులు ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన 1886 నాటికి తారాస్థాయికి చేరింది.1886 మే 1న 40 వేల మంది కార్మికులు సమ్మె మొదలు పెడితే 3 మే నాటికి ఈ సంఖ్య లక్ష మందికి చేరుకుంది. సమ్మె ఉధృతమయ్యేసరికి యాజమాన్యాలు పోలీసుల సాయంకోరి కార్మికులపైకి ఉసిగొల్పారు. ఈ సమయంలో కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. దీంతో అగస్ట్ స్పైస్, పార్సన్స్, క్లోరిన్ మోస్ట్ లూయీస్ లింగ్ అనే కార్మిక నాయకుల ఆధ్వర్యంలో మెక్కార్మిక్ రీపర్ వర్క్ పారిశ్రామిక సంస్థ ముందు పెద్ద ప్రదర్శన జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శన మీద పోలీసులు హేమార్కెట్ వద్ద 4 మే రోజున తిరిగి జరిగిన కాల్పులో 8 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. తర్వాతి రోజుల్లో గాయపడిన వారిలో మరో ఏడుగురు చనిపోయారు. ఈ కాల్పులకు కార్మిక నాయకులే కారణమని వారి మీద హత్యానేరం మోపి అరెస్ట్ చేశారు. నవంబరు 11, 1887లో ఈ కార్మిక నాయకులను దోషులుగా నిర్ధారించిన కోర్టులు పార్సన్స్, స్పైస్, ఎంగెల్, ఫిషర్ లకు ఉరిశిక్ష అమలు చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ మరో కార్మిక నాయకుడు లూయీస్ లింగ్ తననోటిలో బాంబు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతాన్ని ‘హే మార్కెట్ దారుణ హత్యాకాండ’ గా చరిత్రకారులు వర్ణిస్తారు. ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి. 1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. ఆ పైన అనేక ఐరోపా దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. తమ శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని శ్రామికులు గొంతెత్తారు. ఈ చాకిరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం నినదించి, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత జరిగిన అతిపెద్ద మార్పు. 1900 నుంచి 1920 వరకూ ఐరోపాలో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసన ప్రదర్శనలు జరిగేవి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. తరవాతి దశకంలో మే 1ను నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగానూ జరుపుకునేవారు. ఇటలీలో ముస్సోలీ, స్పెయిన్‌లో జనరల్ ఫ్రాంకోలు మే డే పై అనేక ఆంక్షలను విధించారు. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. 1923లో తొలిసారిగా భారత్‌లో ‘మే డే’ను పాటించారు.. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటంతో అప్పటి నుంచే కార్మికవర్గాల్లో చైతన్యం మొదలైంది. ఈ చైతన్యంతో ‘మే డే’ను పాటిస్తున్నారు. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ (ఎల్పీజీ) పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా దేశాల్లో మే 1ని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి వచ్చాయి. ఏటా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఓ అంశం ప్రాతిపదికగా జరుపుకుంటారు. కరోనా నేపథ్యంలో గతేడాది ‘‘పని ప్రదేశాల్లో భద్రత, రక్షణ చర్యలు చేపట్టం’’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. ఈ ఏడాది ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. అయితే, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల కోసం ప్రతి ఒక్కరూ, యజమాన్యాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, దళాలలో చేరాలని, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉండాలి’ అని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) డైరెక్టర్ జనరల్ గై రైడర్ కోరారు.


By May 01, 2021 at 07:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/history-importance-and-theme-of-international-labour-day-2021-in-telugu/articleshow/82337544.cms

No comments