Breaking News

నిరాశతో విసిరి కొట్టిన టిక్కెట్‌కు రూ.7.3 కోట్ల లాటరీ.. భారతీయ కుటుంబం గొప్ప మనసు!


తాను కొనుగోలు చేసిన టిక్కెట్‌కు లాటరీ తగల్లేదని ఓ మహిళ పరధ్యానంగా దుకాణం వద్ద చెత్తకుండీలో పడేసింది. అయితే, ఈ టిక్కెట్‌కే మిలియన్ డాలర్ల లాటరీ వరించింది. తొలుత అదృష్టాన్ని కాలదన్నుకున్నా... చివరికి లక్ష్మీదేవి ఆమెనే వరించింది. ఈ ఘటన అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రం సౌత్‌విక్ పట్టణంలో చోటుచేసుకుంది. అయితే, దీని వెనుక భారతీయ కుటుంబం మంచి మనసు ఉంది. మహిళ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన దుకాణాన్ని ఓ భారతీయ కుటుంబం నిర్వహిస్తోంది. ‘లక్కీ స్టాప్‌’ పేరిట నిర్వహించే ఆ దుకాణానికి లీ రోజ్‌ ఫిగా అనే స్థానిక మహిళ తరుచూ వస్తుంటుంది. గత మార్చిలో ఆమె డైమండ్‌ మిలియన్స్‌ స్క్రాచ్‌-ఆఫ్‌ లాటరీ టికెట్‌ కొనుగోలు చేసింది. లాటరీ ఫలితాన్ని చూసుకునేందుకు ఇటీవల దుకాణానికి వచ్చిన లీ రోజ్‌ ఫిగా పరధ్యానంలో టికెట్‌ స్క్రాచ్ చేసి చూసింది. అయితే, ఆ టిక్కెట్‌ను ఆమె పూర్తిగా స్క్రాచ్ చేయకుండానే.. తనకు లాటరీ తగల్లేదని నిరాశతో అక్కడే ఉన్న చెత్త బుట్టలో పడేసింది. ‘మధ్యాహ్న భోజన విరామంలో షాప్‌కు వెళ్లా. సమయం తక్కువగా ఉండటంతో పరధ్యానం టికెట్‌ను పైపైన గీకి చూసి లాటరీ తగల్లేదులే అంటూ అక్కడే పడేసి వచ్చేశా’ అని ఆమె తెలిపింది. చెత్తలో పది రోజులపాటు పడున్న ఆ టికెట్‌ దుకాణ యజమాని కుమారుడు అభి షా కంటపడింది. టికెట్‌ స్క్రాచ్ చేసిన అభి అవాక్కయ్యాడు. ఆ టిక్కెట్‌కు మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు లాటరీ వరించింది. తన తల్లి అరుణా షా విక్రయించిన ఆ టికెట్‌ పట్టుకొన్న అభి ‘నేను మిలియనీర్‌’ అంటూ కాసేపు గాల్లో తేలిపోయాడు. ఖరీదైన టెస్లా కారు కొందామని అనుకున్నాడు. ‘రెండు రాత్రులు మా కుటుంబానికి నిద్ర లేదు’ అని అభి తండ్రి మౌనిశ్‌ షా తెలిపారు. భారత్‌లోని తాతయ్య, నాయినమ్మలకు ఫోన్ చేసిన అభి.. శారికి ఈ విషయం చెప్పాడు. దీంతో వాళ్లు ఆ సొమ్ము మనకొద్దని, టిక్కెట్ కొన్నవారికే అప్పగించాలని సలహా ఇచ్చారు. దీంతో ఆ టికెట్‌ను విజేతకు అప్పగించాలని మౌనిశ్‌ షా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ విషయం లీ రోజ్‌ ఫిగాకు చెప్పగానే.. ఆమె షాక్‌లో ఉండిపోయింది. తర్వాత షా కుటుంబాన్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇపుడు భారతీయ కుటుంబాన్ని ప్రశంసిస్తూ ప్రతిరోజూ ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. ‘ఆ టికెట్‌ మా దగ్గరే ఉంచుకొని ఉంటే.. ఈ ఆనందం ఉండేది కాదు’ అని అభి ఓ స్థానిక టీవీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.


By May 26, 2021 at 02:10PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/indian-origin-family-in-us-returns-1-million-discarded-lottery-ticket-to-winner-in-us/articleshow/82969392.cms

No comments