Breaking News

ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు.. దాడుల్లో 54 మంది మృతి


ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అటు, హమాస్ ఉగ్రవాదులు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ రాకెట్లను ప్రయోగిస్తున్నారు. ఇరు దేశాల మధ్య తాజా పరిస్థితులు 2014 నాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటి వరకూ 48 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా... దాదాపు 300 మంది గాయపడ్డారు. మృతుల్లో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇజ్రాయేల్ వైమానిక దాడుల్లో గాజాలోని 14 అంతస్తుల భవనం సహా రెండు పెద్ద అపార్ట్‌మెంట్లు నేలమట్టమయ్యాయి. ముందస్తు హెచ్చరికలతో వైమానిక దాడులు జరగడం వల్ల అపార్ట్‌మెంట్ల నుంచి జనం బయటకు వెళ్లిపోయారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై జరిపిన రాకెట్‌ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆరుకు చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతుల్లో కేరళకు చెందిన ఓ మహిళ కూడా ఉన్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదులు ట్యాంకు విధ్వంసక క్షిపణిని ప్రయోగించడంతో ఇజ్రాయెల్‌ సైనికుడొకరు మృత్యువాతపడ్డారు. ఇజ్రాయేల్‌పైకి ఇప్పటివరకు హమాస్‌ 1,050కి పైగా రాకెట్లను ప్రయోగించిందని.. వాటిలో 200 రాకెట్లు గాజాలోనే పడిపోయినట్టు ఇజ్రాయేల్‌ సైన్యం పేర్కొంది. తమ దేశంలో టెల్‌ అవీవ్‌ సహా పలు నగరాలపై ఆ రాకెట్లు పడినట్టు తెలిపింది. అయితే, తమ దాడుల్లో గాజా సిటీ కమాండర్‌ బసెమ్‌ ఇసా సహా పలువురు హమాస్‌ అగ్రనేతలు హతమైనట్టు ప్రకటించింది. బసెమ్‌ మరణ వార్తను హమాస్‌ ధ్రువీకరించింది. బుధవారం జరిపిన దాడుల్లో పలువురు హమాస్ ఉగ్రవాద సంస్థ నిఘా నేతలు హతమయ్యారని ఇజ్రాయేల్ వెల్లడించింది. మరోవైపు- పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్‌ అనుచితరీతిలో వ్యవహరిస్తోందంటూ టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసిన ఆయన.. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయేల్‌కు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. అటు, హమాస్ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెల్ అవీవ్ నగరంపై గాజా ఉగ్రవాదులు అర్ధరాత్రి వేళ రాకెట్ దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. కాగా, 2014లో పాలస్తీనా, ఇజ్రాయేల్ మధ్య యుద్ధం చోటుచేసుకుంది. ఇజ్రాయేల్‌కు చెందిన ముగ్గురు యువకులను హత్య వెనుక హమాస్ ఉగ్రవాదుల హస్తముందని పేర్కొంటూ పాలస్తీనాపై దాడులకు దిగింది. అయితే, హమాస్ మాత్రం యువకుల కిడ్నాప్, హత్యకు తమకు సంబంధం లేదని ప్రకటించినా..తే ఇజ్రాయేల్ మాత్రం తన దాడిని సమర్థించుకుంది. ప్రపంచ దేశాలు కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి.


By May 13, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/israeli-jets-flatten-14-storey-building-in-gaza-hamas-launches-rockets-in-retaliation/articleshow/82594023.cms

No comments