Breaking News

27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి.. విడాకులు తీసుకుంటున్న బిల్ గేట్స్ దంపతులు


మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ దంపతులు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం రాత్రి ట్విటర్‌ ద్వారా గేట్స్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు పొందిన ఈ జంట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. కరోనాపై పోరాటంలోనూ వ్యాక్సినేషన్ కోసం భారీ మొత్తాన్ని ఈ సంస్థ అందజేస్తోంది. ‘‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని ముగించాలని నిర్ణయానికి వచ్చాం’’ అని అన్నారు. ‘‘గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం.. ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం’’ అని వివరించారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్వచ్ఛంద సంస్థ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది.. కొత్త జీవితంలో వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’’ అని ట్విటర్‌లో బిల్‌, మిలిండాలు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ సంపద గత ఫిబ్రవరి నాటికి 137 బిలియన్‌ డాలర్లు. 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలకు ఇప్పటివరకూ 54 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేశారు. రెండేళ్ల కిందట అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజాస్, ఆయన భార్య మెకన్‌జై విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్న ప్రపంచ కుబేరుల జంట ఇదే. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మిలిండాకు 56 ఏళ్లు. అత్యంత చిన్నవయసులోనే మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన బిల్‌గేట్స్‌.. ఆ సంస్థకు సీఈవోగా ఉన్నప్పుడు 1987లో మిలిండా ప్రొడక్ట్‌ మేనేజరుగా చేరారు. అప్పట్లో ఆ సంస్థలో చేరిన ఏకైక ఎంబీఏ మహిళా గ్రాడ్యుయేట్ ఆమే కావడం విశేషం. ఆ తర్వాత ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడటంతో 1994లో వివాహం ద్వారా ఒక్కటయ్యారు. సీఈఓ బాధ్యతల నుంచి 2008లో తప్పుకున్న బిల్ గేట్స్.. ధార్మిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని ప్రకటించారు. తర్వాత బోర్డు సభ్యత్వం నుంచి వైదొలగిన గేట్స్.. కేవలం టెక్నాలజీ ఎడ్వైజర్‌గానే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత రెండు దశాబ్దాలుగా బిల్-మిలిండా గేట్స్ ఫౌండే‌షన్ మలేరియా సహా పలు ప్రాణాంతక వ్యాధులు, వ్యవసాయ పరిశోధనలు, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత వంటి పలు అంశాలకు నిధులు సమకూర్చుతూ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కరోనా వైరస్‌పై పోరాటానికి 250 మిలియన్ డాలర్లు ఖర్చుచేయనున్నట్టు గతేడాది ప్రకటించారు. ఇందులో కొంత మొత్తాన్ని దక్షిణాసియా, సబ్-సహారా ఆఫ్రికాలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం అందజేశారు. అంతేకాదు, కోవిడ్ వంటి మహమ్మారి గురించి 2015లోనే గేట్స్ హెచ్చరించారు.


By May 04, 2021 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/microsoft-founder-bill-and-melinda-gates-announce-his-divorce/articleshow/82380583.cms

No comments