Breaking News

దేశంలో కోవిడ్ కొత్త రికార్డు: తొలిసారి లక్ష దాటిన కేసులు.. అమెరికా తర్వాత ఇక్కడే!


మహమ్మారి రెండో దశ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత పాజిటివ్ కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదుకావడం ఇదే తొలిసారి. గతంలో సెప్టెంబరు 17న అత్యధికంగా 97 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం ఆ రికార్డును తాజా కేసులు అధిగమించాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 103,794 కేసులు నమోదుకాగా.. మరో 477 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితులు సంఖ్య 1,25,87,921కు చేరగా.. కోవిడ్ మరణాలు 1,65,961కి చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 57 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. అక్కడ గడచిన 24 గంటల్లో మరో 222 మంది కోవిడ్-19కు బలయ్యారు. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా చత్తీస్‌గఢ్‌లో 5,250 కేసులు బయటపడ్డాయి. తర్వాత కర్ణాటక 4,553, ఉత్తర్ ప్రదేశ్ 4,136, ఢిల్లీ 4,033, తమిళనాడు 3,581, మధ్యప్రదేశ్ 3,178, పంజాబ్ 3,006, గుజరాత్ 2,875, కేరల 2,802, పశ్చిమ్ బెంగాల్ 1,904, ఆంధ్రప్రదేశ్ 1,733, తెలంగాణ్ 1,321 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశంలోని ప్రస్తుతం నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గత రెండు వారాలుగా దేశంలో నమోదవుతోన్న కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే అధికంగా ఉన్నాయి. కేసుల్లో 57శాతం, మరణాల్లో 47శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుందని స్పష్టంచేసింది. తాజా ఆంక్షలు సోమవారం రాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం( సీఎంవో) వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతమవుతోన్న వేళ.. పంచ సూత్రాల వ్యూహంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కొవిడ్‌ తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో కరోనా నిబంధనలను ప్రజలు వందశాతం పాటించే విధంగా విస్తృత అవగాహన చేపట్టడంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి‘టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్‌ వేగం పెంచడం’ వంటి పంచ సూత్రాల వ్యూహాన్ని అమలు పరచాలని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం, శానిటైజ్‌ నిబంధనలను కచ్చితంగా, నిబద్ధతతో పాటించడం వల్ల కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చని ప్రధాని పునరుద్ఘాటించారు. వీటి ప్రాధాన్యతను వివరిస్తూ ఏప్రిల్‌ 6నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులకు సూచించారు. మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలల్లో కేంద్ర వైద్య నిపుణుల బృందాలు పర్యటించాలని ప్రధానమంత్రి అధికారులకు సూచించారు. ఇదే సమయంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీగా పెంచడంతోపాటు, వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయాలని ప్రధానమంత్రి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.


By April 05, 2021 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-cross-1-lakh-covid-cases-in-a-day-second-country-after-us/articleshow/81905687.cms

No comments