Breaking News

నర్స్ నిర్లక్ష్యం.. ఫోన్‌ మాట్లాడుకుంటూ ఓ మహిళకు రెండు కోవిడ్ టీకాలు!


దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొన్నిచోట్ల టీకా ఇవ్వడంలో అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు ఈ సంఘటనే నిదర్శనం. టీకా కేంద్రంలో వ్యాక్సినేషన్ వేయించుకోడానికి వచ్చిన మహిళకు అక్కడి నర్సు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఒకేసారి రెండు డోస్‌లు ఇచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని కాన్పూర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 2న కాన్పుర్‌కు చెందిన కమలేశ్‌ దేవి (50) అనే మహిళ. టీకా తీసుకునేందుకు అక్బర్‌పూర్ ప్రాంతంలో మండోలిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఈ సమయంలో అక్కడి నర్సు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఆమెకు మొదటి డోసు ఇచ్చారు. మాటల్లో పడి తనకు టీకా ఇచ్చిన విషయం మరిచిపోయిన ఆ నర్సు రెండోసారి వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేసినట్టు బాధితురాలు తెలిపారు. ఈ విషయం గురించి ఆమెను ప్రశ్నిస్తే.. ఆ నర్సు తనతో వాగ్వాదానికి దిగారని ఆమె వివరించారు. తర్వాత ఆమె క్షమాపణ చెప్పినట్టు బాధితురాలు పీటీఐకి తెలిపారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు టీకా పంపిణీ కేంద్రానికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. ఆమెకు ఒక్కసారే టీకా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కమలేష్‌ కుమారి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు. కుటుంబసభ్యులు మాత్రం ఆమె చేతికి స్వల్పంగా వాపు వచ్చినట్టు తెలిపారు.


By April 04, 2021 at 09:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/busy-on-phone-call-nurse-gives-woman-2-doses-of-covid-19-vaccine-in-up/articleshow/81894304.cms

No comments