Breaking News

సోలీ సోరాబ్జీ ఇకలేరు.. కరోనాతో కన్నుమూసిన న్యాయదిగ్గజం


మాజీ అటార్నీ జనరల్ (91) కరోనాతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దేశంలో అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరిగా సోరాబ్జీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు సైతం వరించింది. అంతేకాదు, రెండుసార్లు అటార్నీ జనరల్‌గా నియమితులు కావడం విశేషం. నైజీరియా కోసం ఐరాస మానవహక్కుల న్యాయవాదిగానూ సేవలను అందించారు. ఐరాస మానవ హక్కుల రక్షణ, ప్రచార ఉప సంఘానికి ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. మహారాష్ట్రలోని ముంబయిలో 1930లో జన్మించిన సోలీ జహంగీర్ సోరాబ్జీ.. 23 ఏళ్ల వయసులో బాంబే హైకోర్టు లాయర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత 1971లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. తొలిసారి 1989లోనూ, తర్వాత 1998 నుంచి 2004 వరకు భారత ప్రభుత్వం అటార్నీ జనరల్‌గా ఉన్నారు. మానవహక్కుల న్యాయవాదిగా సోరాబ్జీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఐరాస మానవ హక్కుల రక్షణ, ప్రచార ఉప సంఘానికి ఛైర్మన్‌గా 1998 నుంచి 2004 వరకు, మైనార్టీల రక్షణ, వివక్షత నిరోధ కమిటీలో సభ్యుడిగానూ ఉన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో 2000 నుంచి 2006 వరకు సభ్యుడిగా కొనసాగారు. అలాగే, భారత రాజ్యాంగం సమీక్షకు 2002లో ఏర్పాటైన కమిషన్‌లోనూ సభ్యుడిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు వెలువరించి అనేక చారిత్రాత్మక తీర్పుల్లో ఈ న్యాయకోవిదుడు వాదనలు వినిపించారు. భావప్రకటన, పత్రికా స్వేచ్ఛ, రాష్ట్రాల్లో పోలీసుల అధికారులపై పరిమితులు, శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ప్రధాన మంత్రులు, గవర్నర్లు అధికార పరిధి వంటి కేసులను విజయవంతంగా వాదించారు. న్యాయవాది మాత్రమే కాదు, సోరాబ్జీ మంచి రచయిత కూడా.


By April 30, 2021 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-attorney-general-soli-sorabjee-dies-due-to-covid-19/articleshow/82322579.cms

No comments